- మహిళల ప్రవేశం విషయంలో నిబంధనలు ఉండాలి..
- ఇది మాత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం అన్న కేంద్రం.
శబరిమల ఆలయంలో మహిళల ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. 9 మంది సభ్యుల ధర్మాసనం విభిన్న కోణాల్లో ఈ అంశాన్ని విచారిస్తున్నది. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అషానుద్దిన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మాసి, ప్రసన్న బి వర్లే, ఆర్ మహాదేవన్, జోయ్మాల్యా బాగ్చీ ఉన్నారు.
10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న అంశంతో పాటు మరికొన్ని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది. అయితే సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వ సమర్థించింది.
అయితే ఆ అంశం మత విశ్వాసాలకు చెందుతుందని, మతం పరిధిలోకి వస్తుందని, జుడిషియల్ పరిధిలోకి ఇది రాదు అని ప్రభుత్వం చెప్పింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఏదైనా అశాస్త్రీయ విధానం ఉంటే, దాన్ని శాసనాల ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు. ప్రతి మతపరమైన విధానాన్ని గౌరవించాలని, ప్రతి అంశాన్ని హుందాతనానికి, శరీర స్వేచ్ఛకు ఆపాదించలేమన్నారు. మసీదుకు వెళ్లినా, గురుద్వారకు వెళ్లినా.. ముఖాన్ని కప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నా గౌరవాన్ని, హక్కును లాక్కున్నారని అనలేమని తుషార్ మెహతా చెప్పారు. మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగం రక్షిస్తుందన్నారు.
