- స్మశాన వాటిక కబ్జాకు నకిలీ పత్రాల సృష్టించిన అక్రమార్కులు..
- గుండాలను పెట్టీ భయబ్రాంతులకు గురిచేస్తూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠా..
- సాక్షాత్తు సికింద్రాబాద్ ఎమ్మార్వో కేసు పెట్టినా పట్టించుకొని గాంధీ నగర్ పోలీస్ అధికారులు..
- జీహెచ్ఎంసీ అధికారులు చేసిన సీజ్ ని తొలగించి దర్జాగా పనులు చేస్తున్న కబ్జాకోర్లు..
- స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని మొర పెట్టుకుంటున్న కురుమ సంఘ కులస్తులు..
- తెరవెనుక స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు..
- కబ్జాదారులకు అండగా పోలీస్ అధికారులు.. మండి పడుతున్న స్థానిక ప్రజలు..
- కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం..
- ఈ కబ్జాని కట్టడి చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన హైడ్రా..
ఇటీవల కాలంలో నగరంలో జరిగిన ఒక సంఘటన తీవ్ర దుమారం రేపింది.. ఒక దళిత వ్యక్తిపై ఉస్మాన్ గంజ్ లో ఒక మార్వాడీ శేట్ చేయిచేసుకోవడం కలకలం రేపింది.. మార్వాడీ హఠావ్ అనే నినాదాలు, డిమాండ్లు సైతం వెల్లువెత్తాయి.. అయితే పరిస్థితులు చేజారకముందే ప్రభుత్వం, పోలీసులు కలుగజేసుకుని ఆ వ్యవహారం సద్దుమణిగేలా చేశారు.. కానీ ఇదే మార్వాడీలు స్మశాన స్థలాన్ని ఆక్రమించుకోని, అక్రమ నిర్మాణాలు చేస్తూ, స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్న దారుణ సంఘటన వెలుగుచూసింది.. స్మశానం అనగానే మనిషి జీవితంలో చివరిమజిలీ అని తెలుసు.. అక్కడ సాక్షాత్తూ ఆ పరమశివుడు నివసిస్తుంటాడని నమ్ముతారు.. స్మశానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.. మనిషి ప్రాణాలు విడిచాక స్మశానంలో చివరి అంత్యక్రియలు చేస్తారు.. దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.. అలాంటి పవిత్ర స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు సాగిస్తే అలాంటి వారిని ఏమనాలి..? వారు క్షమించడానికి కూడా అర్హులు కారు.. ఇప్పుడు వెలుగు చూసిన దారుణ సంఘటన వివరాలు చూద్దాం..

హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ మండల పరిధిలోని, బోలక్ పూర్ రెవెన్యూ శివారు, బన్సీలాల్ పేటలో రెవెన్యూ సర్వే నెంబర్. 77, టౌన్ సర్వే నెంబర్ 8లో మొత్తం 16 ఎకరాల 18 గుంటలు విస్తీర్ణం గల కురుమ కులస్తులకు చెందిన స్మశాన వాటిక స్థలం కలదని అక్కడి స్థానికులు పేర్కొన్నారు.. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. బొందల గడ్డ స్థలంపై కన్నేసిన కార్ఖాణలో నివసించే వికాస్ అగర్వాల్ అనేవ్యక్తి, అలాగే జీడిమెట్లలో నివాసం ఉండే అను అగర్వాల్ అనే మరొక మార్వాడీ.. వీరిద్దరూ కలిసి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో పక్కా ప్రణాళికతో నకిలీ పత్రాలు సృష్టించి, శ్మశానవాటిక స్థలం కబ్జాకు తెరలేపారు.. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ దండలతో యదేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.. నకిలీ పత్రాలతో సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లాట్ నెంబర్ 41/బి, 41/సి లను చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జాదారులు.. కాసులకు కక్కుర్తి పడ్డ సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయి బొందల గడ్డను.. డాక్యుమెంట్ నెంబర్స్ 411/2023, 408/2023, 413/2023గా రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకున్నాడు.. కబ్జాదారులకు ఉన్న పలుకుబడితో జిహెచ్ఎంసి లోని ఉన్న అవినీతి అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని లొకేషన్ స్కెచ్ లేకుండానే 366312/0886/GHMC/2024, తేది 29-01-2024 రోజున అక్రమంగా నిర్మాణా అనుమతులు తెచ్చుకున్నారు..

ఇలా దొడ్డి దారిన సమాధిలపై నిర్మాణ అనుమతులు పొందారని కురుమ సంఘ కులస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వీరి అక్రమాలను కబ్జాలను పసిగట్టిన స్థానికులు అధికారులకు పిర్యాదు చేశారు.. కాగా అధికారుల విచారణలో బోగస్ సర్వే నెంబర్ వేసుకొని, నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తుంది వాస్తవమే అని సికింద్రాబాద్ ఆర్డీవో సాయి రామ్, తహసిల్దార్ పాండు నాయక్ తేల్చి చెప్పారు.. అంతే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో తేదీ 14-07-2025 రోజున పిర్యాదు చేశారు.. దీని యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ 191/2025 గా నమోదై ఎలాంటి విచారణకు నోచుకోకుండా ఉంది.. కళ్లెదుటే కబ్జా చేస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న కబ్జాల ముఠాను గాంధీ నగర్ పోలీస్ అధికారులు ప్రోత్సహిస్తూ వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఈ ప్రాంత ప్రజలు మండి పడుతున్నారు.. పోలీస్ అధికారులకు స్థానిక తహశీల్దార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినప్పటికీ.. కబ్జాదారులను అరెస్టు చేయకుండా.. వారికి వత్తాసు పలుకడంపై భారీ ఎత్తున ముడుపులు తీసుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. తెలంగాణ రాష్ట్ర డిజిపి స్పందించి గాంధీ నగర్ పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా..? లేదా యూనిఫాం ముసుగులో కబ్జాదారులతో ములాఖాత్ అయి బొందల గడ్డ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్నారా..? అన్నది విచారణ చేయాలనే డిమాండ్స్ సైతం వినిపిస్తున్నా యి..కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ, వారికి అండగా నిలుస్తున్న గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి, పారదర్శకమైన పాలన అందించాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..



ఈ కబ్జా వ్యవహారంలో భాగస్వాములైన పోలీస్, జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే వీరి అక్రమాలు మరిన్ని బట్టబయలయ్యే అవకాశం ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర డిజిపి స్పందించి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో కబ్జాలను కట్టడి చేయాల్సిన పోలీసు అధికారులు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని.. కబ్జాలో భాగస్వాములైన సిఐ, ఎస్ఐలను తక్షణమే విధుల నుండి తొలగించాలని.. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమ కులస్తులంతా స్పందించి, వారంతా ఏకమై డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు..