కంపదాకా తొండ పరుగు.. గాలిబోతే కట్టెవొరుగు.. అన్ని పాటులు భంగపాటుకే.. ఎల్ల బాటలు వల్లకాటికే. దహనం చేయటం, పూడ్చటం వల్లకాటి(Cemetery)లో అమలుచేసే పద్ధతులు. వల్లకాడంటే కాటికాపరి తిరిగే చోటు కాదు. స్మశానాన్ని(Burying Ground) స్మశాన వాటిక, కాడు, వల్లకాడు, కాష్టం అని కూడా అంటారు. చనిపోయినవారికి ఇక్కడ అంత్యక్రియలు(Funeral) చేస్తారు. ప్రతి ఊరికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ స్మశానాలు ఉంటాయి. చనిపోయినవారికి గుర్తుగా కొందరు సమాధిని నిర్మిస్తారు. చనిపోయినవారిని దహనం చేసేందుకు కట్టెలతో చేసిన ఏర్పాటును చితి అంటారు. ఎన్నాళ్లు బతికినా.. ఎంత గొప్పగా బతికినా.. ఎంత డబ్బున్నా, పేరున్నా చివరికి పోవాల్సింది వల్లకాటికే.
తాము చనిపోయిన తర్వాత ప్రజాప్రయోజనార్థం తమ శరీరాన్ని ఖననం లేదా దహనం చేయకుండా వైద్య కళాశాలలకు ఇవ్వాలని కొందరు దాతలు, కొన్ని చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని.. అనంతపురంలో ప్రజాసైన్స్ వేదిక ఆధ్వర్యంలో అనంత శరీర దాతల సంఘం, నెల్లూరులో తిక్కవరపు సుకుమార్ రెడ్డి పినాకిని దేహ దాతల సంఘం, విశాఖ గూడూరు సీతామాలక్ష్మి నిర్వహిస్తున్న దేహ దాతల సంఘం. వైరాగ్యం గురించి తెలియాలంటే స్మశానాన్ని సందర్శించాలని చెబుతారు. మరోవైపు కొన్ని ఊళ్లల్లో స్మశానాలు స్వర్గధామంలా నిలుస్తున్నాయి. అక్కడ నిర్వహిస్తున్న స్మశానవాటికలు బొటానికల్ గార్డెన్(Botanical Garden)ను తలదన్నేలా ఉంటున్నాయి.
గ్రామ పరిశుభ్రత కోసం పదేళ్లుగా చేస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా ఫలాపేక్ష లేకుండా పనిచేయడం తక్కువ మందికి సాధ్యమని చెప్పొచ్చు. చల్లపల్లిలో వైద్య దంపతులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ పద్మావతి, అలాగే.. హైదరాబాద్ తిరుమలగిరిలో వెలసిన స్వర్గధామం స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రమే ఇది సాధ్యం. తిరుమలగిరిలో వెలసిన స్వర్గధామం 2013 నుంచి నిర్విఘ్నంగా పనిచేస్తోంది. శ్రీ రజ్వంత్ సింగ్ గులాటీ ఏర్పాటుచేసిన ఎకో ఫ్రెండ్లీ(Eco Friendly) స్మశానవాటికలో 108 అడుగుల శివుడి విగ్రహం, ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే తాము చనిపోతే ఇలాంటి చోట అంత్యక్రియలు చేయాలని ప్రతి ఒక్కరూ తలుస్తారు.
ఇది కార్పొరేట్ కార్యాలయంలా ఉంటుంది. ఏటా 1500 పార్థివదేహాలకు పైగా అక్కడ దహనం చేస్తున్నారు. కేవలం రూ.6,500కే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రజ్వంత్ సింగ్ గులాటీ 2018లో అన్నదానం చేశారు. సుమారు లక్షా యాభై వేల మంది ఆకలి తీర్చేవారు. కరోనా వల్ల అన్నదాన వితరణను విరమించారు. 2021లో ఆకస్మిక మరణం తర్వాత ఆయన భార్య చరణ్‌జీత్ కౌర్, తేజిందర్ కౌర్, గులిస్తాన్ నాజ్, బలసుదన్ తదితరులు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్‌లో ఉన్న అన్‌క్లైమ్‌డ్ బాడీస్, అనాథ శవాలకు ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నారు.
వృద్ధాశ్రమాలు, నిరాదరణకు గురైన వృద్దులకు ఏమాత్రం డబ్బు తీసుకోకుండా అన్ని కార్యాలు నిర్వహిస్తున్నారు. స్వర్గధామం మంచి వాతావరణంలో ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మనిషి చివరి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండేందుకు వీళ్లు చేస్తున్న సేవ ఆదర్శప్రాయం. మెరుగైన పౌర సేవలు చేస్తున్న ఇలాంటి సంస్థలను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం మరిన్ని ఎకో ఫ్రెండ్లీ స్మశాన వాటికలు నిర్మించాలి.
- డాక్టర్ ముచ్చుకోట సురేష్ బాబు
