Tuesday, October 28, 2025
ePaper
Homeరాజకీయంఅసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు

అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు

సిపిఎం మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత

బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలుతో తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అందువల్ల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు సీపీఎం కార్యదర్శి జాన్‌ వెస్లీ మద్దతు కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు. కుల గణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయమని సీపీఎం కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదని తమ నమ్మకమని తెలిపారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News