- అసెంబ్లీ ముట్టడికి బయల్దేరక ముందే బీఆర్ఎస్ నేతల అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరుకావడానికి సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎం.డి. జమాల్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పత్తి వెంకటేష్‌లను మంగళవారం ఉదయం వారి నివాసాల వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నేతలను ఇంటి నుంచే బయటకు రాకముందే అదుపులోకి తీసుకోవడం పట్ల స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అరెస్టు అయిన నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసన తెలపడానికి వెళ్తుండగా ముందస్తు అరెస్టులు చేయడం తగదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆ హక్కును పోలీసులు హరించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమను విడుదల చేసి, అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు, పరిస్థితులు అదుపులో ఉంచేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
