Monday, October 27, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంBoduppal | మున్సిపల్ లో... సచ్చినోళ్ళ సంతకాలతో... బోగస్ లేఔట్ల దందా..!

Boduppal | మున్సిపల్ లో… సచ్చినోళ్ళ సంతకాలతో… బోగస్ లేఔట్ల దందా..!

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలోని బోడుప్పల్(Boduppal ) మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి తొమ్మిది సంవత్సరములు కావస్తున్న ఇంకా సచ్చినోళ్ల సంతకాలతో గ్రామపంచాయతీ పేరుతో  బోగస్ లేఔట్లు వెలుస్తూనే ఉన్నాయి. మున్సిపల్ లో ఔట్సోర్సింగ్ గా పనిచేస్తున్న ఒకరి సహకారంతో 2018 సంవత్సరంలో కూడా బోగస్ లేఅవుట్ దిగ్విజయంగా పూర్తి చేసిన విషయం అందరికి తెలిసిందే.

నాటి అక్రమదారులే నేడు అదే తరహాలో చెంగిచెర్ల సర్వేనెంబర్ 141 లో బోడుప్పల్ గ్రామపంచాయతీ పేరుతో బోగస్ లేఅవుట్ తయారుచేసి సుమారు 300కు పైగా ప్లాట్లతో లేఔట్(Layout) ఏర్పాటుకు సహకరించారు. చెంగిచెర్ల ప్రాంతంలోని సర్వేనెంబర్ 141 గత పది సంవత్సరాలకు పైగా కోర్టు కేసులలో పెండింగ్ లో ఉన్నది. 2018 వ సంవత్సరం అంటే అప్పటికే మున్సిపల్ ఏర్పడి రెండు సంవత్సరములు కావస్తున్నది.

ఇదే సర్వే నెంబర్ లో సుమారు నాలుగు ఎకరాలకు పైగా బోగస్ లే అవుట్ తో  పాటు చెంగిచెర్ల గ్రామపంచాయతీ నుండి ఇంటి పర్మిషన్లు పొందినట్టు చూపించి నకిలీ పర్మిషన్లతో వివిధ బ్యాంకులలో రుణాలు తీసుకొని ఇండ్లు నిర్మించారు. అదే సమయంలో అప్పటి మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner), టీపివోలు పలుమార్లు అక్రమంగా నిర్మించిన ఇండ్లను పాక్షికంగా కూల్చివేసి,వాళ్లకు రావాల్సిన మామూళ్లను రాగానే వదిలిపెట్టారు. అప్పుడు అక్రమంగా నిర్మించిన  ఇండ్లకు నేటి వరకు ఎలాంటి ఇంటి నెంబర్లు ఇవ్వలేదు.

కానీ, అక్రమ దారులు వాళ్ళ ప్లాట్లను ఇండ్లను అమ్ముకొని వాళ్లకి రావాల్సిన సొమ్మును వెనకేసుకున్నారు. నాడు ఇండ్లు కొన్న మధ్యతరగతి ప్రజలు వాళ్లకు ఇంటి నెంబర్లు రాక ఇప్పటికీ పలు అవస్థలు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇంటి నెంబర్లు చేసుకోవడానికి కొంత వ్యవధి రాగా, ఆ సమయంలోనే విక్రయదారులు మొండికేయగా తప్పని పరిస్థితులలో కొద్దిమందికి ఆన్లైన్ ద్వారా ఇంటి నెంబర్లు ఇప్పించగలిగారు.

నేడు కూడా అదే తరహాలో నాలా కన్వర్షన్ లేకుండా బోగస్ లేఔట్ సృష్టించి,  ఇప్పటికే 30శాతం ప్లాట్లు అమ్మి, దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో లాగా నేడు మున్సిపల్ అధికారులు ఎలాంటి లావాదేవీలకు లొంగ కుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

చెంగిచెర్ల రెండవ డివిజన్ సర్వే నెంబర్ 141 గత కొన్ని సంవత్సరాలుగా హైకోర్టులో కేసు నడుస్తున్నది. కేసు నెంబర్ డబ్ల్యూ పి-22172/2018 ఇట్టి కేసు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వాయిదాకు రావచ్చు. ఎల్.ఆర్ నెంబర్ 949/2020, డబ్ల్యూ.పి. 10515/2025 మరియు ఐ ఏ నెంబర్ 2/2025 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

సర్వేనెంబర్ 141 భూమి ఈరోజు వరకు వ్యవసాయ భూమి గానే రెవెన్యూ రికార్డులో ఉన్నది. మరియు రెవెన్యూ ఆన్లైన్ రికార్డులో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ మరియు స్టే కూడా కలదు. లేఔట్ చేయాలంటే స్థానిక ఎమ్మార్వో నుండి నాలా కన్వెర్షన్ పరిశీలన జరిపి ఆర్డిఓకి నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా రెసిడెన్సియల్ భూమిగా పరిగణించబడుతుంది.

స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో చట్టబద్ధత లేకుండానే లే అవుట్ ను చేస్తున్నారు. అన్ని విషయాలు తెలిసి కూడా స్థానిక ఎమ్మార్వో మౌనం వహించడం వెనకాల అంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు.

మున్సిపల్ పరిధిలో ఎక్కడ లేఅవుట్ చేసినా అది స్థానిక మున్సిపల్ నుండి గాని హెచ్ఎండిఏ నుండి తప్పనిసరిగా లేఅవుట్ అనుమతి పొంది అభివృద్ధి పనులు చేసినట్లయితే విద్యుత్ శాఖ ఏఈ స్వయంగా పరిశీలించి ఎన్ని స్తంభాలు పడుతున్నాయి,ఎక్కడ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలనేది విద్యుత్ శాఖ మేడిపల్లి ఏఈ సూచించాలి. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విద్యుత్ శాఖ వారు అక్రమ దారులతో కుమ్మక్కై విద్యుత్ స్తంభాలను లేఔట్ లో నాటుతున్నారు.

మేడిపల్లి విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే మేడిపల్లి మండల పరిధిలో పలు చోట్ల అక్రమంగా స్థంభాలు వేస్తూ మీటర్లు బిగిస్తున్నారు. గతంలో చెట్లకు కూడా మీటర్లు బిగించిన సందర్భాలు ఉన్నాయి. మేడిపల్లి విద్యుత్ శాఖ అవినీతి చెప్పాలంటే కోకొల్లలు.

మున్సిపల్ పరిధిలో ఎక్కడ లేఅవుట్ చేయాలన్న హెచ్ఎండి అనుమతులు తప్పనిసరి. అలాగే ఇంటి అనుమతులు కావాలన్నా టిఎస్‌బిపాస్ అనుమతులు కావాల్సిందే…కానీ బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకున్నా పర్వాలేదు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కావ్యను కలిస్తే చాలు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

ఇప్పటికే ఈమె ఖాతాలో 100కు పైగా కమర్షియల్ షెడ్లు, కమర్షియల్ భవనాలు, అలాగే ఇండ్ల అనుమతులు ఒక రకం నిర్మించేది మరోరకం. ఈమెకు తోడుగా ఓ నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది. ఎల్లవేళలా జి హుజూర్ అంటూ కలెక్షన్ల వసూల్ కోసం 24/7 పనిచేస్తూ లక్షలు సంపాదిస్తూ, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

ఈ బోగస్ లే అవుట్‌కు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో ఎలాంటి అనుమతులు లేకుండా, పై శాఖల వారితో ఆటంకం కలగకుండా అక్రమ దారులు అందర్నీ లోబరుచుకొని లేఅవుట్ లో చకచకా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ… అక్రమ వ్యాపారాన్ని కోట్ల రూపాయలలో ఆదాయం పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు.

మున్సిపల్ పరిధిలో జరిగే బోగస్ లేఔట్ మరియు అనుమతులు లేకుండా జరిగే అన్ని అక్రమ నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని,అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్న మున్సిపల్, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడంలేదని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి వాపోయారు.

పై ముగ్గురు  అధికారులు నిజాయితీగా పనిచేయకుండా అక్రమదారులకు సహకరిస్తూ, ప్రభుత్వం ఆదాయం కోల్పోయి అప్పులపాలు కావల్సి వస్తున్నదని మంద సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమదారులకు సహకరిస్తున్న అధికారుల తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి,కలెక్టర్ కార్యాలయంను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల సర్వేనెంబర్ 141 హై కోర్టులో కేసు ఉండగా బోగస్ లే అవుట్ తయారుచేసి, అభివృద్ధి పనులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి తగు సూచనలు ఇచ్చానని, అతి త్వరలో బోగస్ లేఔట్ ను ఆపి కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తానని చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా మున్సిపల్ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News