420 హామీలతో రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను వంచించారు
- రైజింగ్ తెలంగాణ కాదు.. అవినీతి తెలంగాణ : ఎంపీ లక్ష్మణ్
- కేసీఆర్, రేవంత్ పాలనకు ఏ మాత్రం తేడా లేదు
- రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు
- కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తది
- త్వరలో కాంగ్రెస్‌ను ఇంటికి పంపనున్న ప్రజలు : తెలంగాణ బీజేపీ చీఫ్
- ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా
- కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిన నిరసన
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు హాజరు
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను రేవంత్ రెడ్డి వంచించారని ఆయన పాలనపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో.. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన.. వంచన పాలన తప్పితే మరొకటి కాదని మండిపడ్డారు.రేవంత్ పాలన 420 అని.. ఆయనది ఫేక్ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
420 హామీలతో రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను వంచించారని విమర్శించారు. ఈ హామీలపై తెలంగాణ ప్రజలతోపాటు బీజేపీ సైతం ప్రశ్నిస్తోందని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తున్న సమాజానికి సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధితోపాటు నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పాలన్నారు. మోసం చేయడం.. ప్రజల దృష్టిని మళ్లించడం సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎంపీ లక్ష్మణ్ అభివర్ణించారు. రైజింగ్ తెలంగాణ అంటే ఏమిటో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.రైజింగ్ తెలంగాణ.. డ్రగ్స్ కల్చర్‌గా మారిపోయిందని.. రైజింగ్ తెలంగాణ.. గన్ కల్చర్‌గా పెరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టపగలే పోలీసులను కాల్చి పడేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. పోలీసులకే దిక్కు లేదు, ల్యాండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్, డ్రగ్స్, ఆన్ లైన్ గేమ్, ల్యాండ్ మాఫియా కల్చర్లలో రాష్ట్రం కూరుకుపోయిందన్నారు. రైజింగ్ తెలంగాణ కాదు ఇది అవినీతి తెలంగాణ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోలేని భయాందోళనలో కంపెనీలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ మహనగరం కాంక్రీట్ జంగల్‌గా మారిపోయిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలుగా మారి ప్రజలను పీడిస్తున్నాయన్నారు.
ఈ రెండేళ్లలో అంతకన్నా రెట్టింపు అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అప్పులు పుట్టడం లేదు, చెప్పులు ఎత్తుకు పోయేలా చూస్తున్నారని చెప్పిన రేవంత్.. నేడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటే నమ్ముతారా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు.రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ స్కాంల కోసమే తప్ప మరొకటి కాదన్నారు. రైజింగ్ పేరుతో హైదరాబాద్‌ను ఏం చేయబోతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో భూములను కాజేస్తామంటే సహించేది లేదని..
అడుగడుగున అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని.. లేకపోతే రాష్ట్రం లూటీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన 420 హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పత్త లేరన్నారు. జాతీయ కుల గణన ద్వారానే దేశంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం.. వేటాడతాం.. విడిచి పెట్టేది లేదంటూ రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ సర్కార్‌ను అడుగడుగునా నిలదీసేందుకు సంసిద్ధం కావాలని ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం : తెలంగాణ బీజేపీ చీఫ్
కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు ఇంత వరకు ఎందుకు విడుదల చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్.. మాఫియా చేతిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు మిగిలేది శూన్యమన్నారు. కాంగ్రెస్ సీకింగ్.. బీజేపీ రేజింగ్ అని పేర్కొన్నారు.మత రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడు కోట్ల మంది దేవుళ్లు ఉంటే..
కాంగ్రెస్ పార్టీకి ముగ్గురే దేవుళ్లని.. వారే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంటూ వ్యంగ్యంగా వివరించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. దేశ ద్రోహులను పోషిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని విమర్శించారు.కేంద్రం ఏమి ఇచ్చిందంటూ అబద్ధాలు చెప్పుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తుందని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన ఇంటి కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ మహా ధర్నా మహా ధర్మ యుద్ధంగా మారుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వచ్ఛ లేదన్నారు. రాబోయే మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌గా మారిందని.. ప్రస్తుతం ఆ పార్టీ వీఆర్‌ఎస్ తీసుకుందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, రేవంత్ పాలనకు ఏ మాత్రం తేడా లేదు :కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు తేడా లేదని.. ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మిగుల రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలన మనం చూశామని.. కేసీఆర్ కుటుంబ పాలన ఎంత అవినీతి చేసిందో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్న ఈ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో ఆనాడు బందీ అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందని.. హామీలు అమలు చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో దినోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ సీఎం రేవంత్‌పై మండిపడ్డారు.
ప్రజలకు ఏం చేశారని ఈ ఉత్సవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకి ఇచ్చే సన్న బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం మార్పు రాలేదని.. కేసీఆర్ పోయి.. రేవంత్ రెడ్డి వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలనలో మార్పు లేదు.. దోపిడీలో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఈ రెండేళ్లలో అమలు చేసి ఉంటే ఇందిరాపార్క్ వద్ద తనతో చర్చకు వస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని.. ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలు ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.వృద్ధులు, వికలాంగులకి పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఏమయ్యాయంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిలదీశారు. ప్రభుత్వ భూములని అమ్మకపోతే పూట గడవని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిదంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్‌లు రద్దు చేస్తామన్నారని.. వాటిని ఎందుకు రద్దు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కుటుంబాలను రోడ్ మీద పడేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
