Tuesday, October 28, 2025
ePaper
Homeసాహిత్యంBhagat singh|యువత నెత్తుటి నరాలలో ప్రవహించే ఉత్తేజం భగత్ సింగ్!!

Bhagat singh|యువత నెత్తుటి నరాలలో ప్రవహించే ఉత్తేజం భగత్ సింగ్!!

నేడు సెప్టెంబర్ 28 షాహీద్ భగత్ సింగ్ 118వ జయంతి, 20వ శతాబ్దం ప్రారంభ దశకాల్లో భారత స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భం, గాంధీజీ, నెహ్రూజీ దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా సహాయ నిరాకరణ ఉద్యమం నడిపినట్లుగానే, కొందరు విప్లవకారులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ చెమటను,రక్తాన్ని చిందించారు. చెప్పుకోదగ్గ అనేకమంది విప్లవకారులలో దేశ యువత మెదళ్ళలో నాటుకుపోయిన పేరు షాహిద్ భగత్ సింగ్(Bhagat singh). 23 సంవత్సరాల పసివయస్సులోనే నా దేశానికి స్వాతంత్రం కావాలంటూ, అసమానతలు లేని సమాజస్థాపనే లక్ష్యంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉరి తీయబడ్డాడు. భారత ప్రజలకు భగత్ సింగ్ అనాగరిక ఆలోచనలు వీడి, శాస్త్రీయ దృక్పథంతో ఎలా పురోగమించాలో నేర్పాడు. భారత రాజకీయాల్లో నూతన ఆవిష్కృతం భగత్ సింగ్, లౌకికవాది. ప్రజలకు సమాజంలోని రుగ్మతలను తెలియజెప్పి,  హేతుబద్ధతో ఆలోచించడం, సమానత్వంకై పోరాడే  ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాడు. దేశాన్ని, దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. మనిషిని మనిషి దోచుకునే విధానం పోవాలని, దేశాన్ని,దేశం దోపిడీ చేసే విధానం ఉండకూడదని అన్నాడు. దీనికోసం భారతీయ యువత సంఘటితమై కొట్లాడాలన్నారు. భారత యువత ఉప్పొంగే నెత్తుటి నరాలలో ప్రవహించే ఉత్తేజం భగత్ సింగ్, భారతదేశ చరిత్రలో అతని పేరు చిరస్మరణీయం.

బాల్యం, విద్యాభ్యాసం:

భగత్ సింగ్ (Bhagat singh) సెప్టెంబర్ 28, 1907, నాటి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న పంజాబ్ ప్రొవిజన్స్ లో బంగా అనే గ్రామంలో జన్మించాడు. అప్పటికే స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములైన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతిల నుండి, ఆంగ్లో- సిక్కు ఉద్యమంలో పాల్గొన్న ముత్తాత సర్ధార్ ఫతే సింగ్ నుండి స్పూర్తి పొందాడు, తన గురువు గదర్ వీరుడు కర్తార్ సింగ్ షరభా నుండి రాజీకీయ ప్రేరణ పొందాడు. డిఏవి పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అనంతరం నేషనల్ కళాశాలలో చేరాడు. భగత్ సింగ్(Bhagat singh) లో బహుముఖ ప్రజ్ఞాశాలి. చిన్న వయసులోనే చదవడం, రాయడం పట్ల ఎక్కువ మక్కువ, నాటికల్లో, పాఠశాలల్లో నిర్వహించే ఉపన్యాస పోటీల్లో బాగా రాణించేవాడు. సామ్యవాద భావజాలం పట్ల ఆకర్షితుడైనాడు. 1926 మార్చిలో నవ జవాన్ సభ అనే యువ ఇండియన్ సోషలిస్టు సంస్థ స్థాపించాడు, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరి, విప్లవకారులైన చంద్రశేఖర్ ఆజాద్ రాంప్రసాద్ బిస్మిల్, మరికొందరితో కలిసి పని చేసాడు. తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించినప్పుడు, దేశ స్వాతంత్ర్యమే తన లక్ష్యమని, అసమానతలు లేని సమసమాజ స్థాపన తన ధ్యేయమని, ఆయా లక్ష్యాల కోసం పనిచేసే క్రమంలో పెండ్లి ఆటంకంగా మారుతుందని తాను పెళ్లి చేసుకోబోనని తల్లిదండ్రులకు సూటిగా చెప్పాడు. అమృత్ సర్ లో ఉర్దూ, పంజాబీ వార్తాపత్రికలకు సంపాదకుడుగా పని చేశాడు. నేనేందుకు నాస్థికుడనయ్యాను అనే అంశంపై వ్యాసాన్ని రాసాడు. తన సాహిత్యం, దేశ యువతను ఆకర్షింప చేస్తోందని, తన ఆలోచనలు దేశవ్యాప్త యువతను సంఘటితం చేస్తుందని గమనించిన బ్రిటిష్ పాలకులు 1927లో భగత్ సింగ్ అరెస్ట్ చేశారు.

1928 సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా

1928లో సైమన్ కమిషన్ లాహోర్ కు వచ్చినప్పుడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. హాజరైన జన సందోహాన్ని చల్లా చదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించారు. లాలాలజపతి రాయిపై క్రూరంగా దాడి చేశారు, పోలీసులు కొట్టిన తీవ్రమైన దెబ్బలతో నవంబర్ 17 , 1928న గుండెపోటుతో లాలాలజపతిరాయ్ మరణించారు. లాలాజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుకుదేవ్ తాపర్, శివరాం రాజ్ గురు స్కాట్ ను చంపాలని నిర్ణయించుకుంటారు. అనుకోకుండా తమ ఎత్తుగడ విఫలమై స్కాట్ కు బదులుగా, అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జెపి సాండర్స్ ను చంపగా, ఈ ఘటనను శాంతియుత పంథాలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీ తో సహా కొందరు జాతీయ నాయకులు ఖండించారు, అనేక వార్తాపత్రికలు దీనిని తప్పుబట్టాయి. కానీ దేశవ్యాప్తంగా యువత, పెద్ద ఎత్తున ప్రజానీకం భగత్ సింగ్ ధైర్య సాహసాలను చూసి బ్రిటీష్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. స్కాట్ దొరకకపోగా, తమ ఎత్తుగడ విఫలమై జెపి సాండర్స్ మరణించగా, అక్కడినుండి నలుగురు విప్లవకారులు సైకిళ్లపై తమ ఇండ్లకు చేరి, లాహోర్ ని విడిచి వెళ్లి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నాయకుల ఇండ్లల్లో తల దాచుకున్నారు. ఈ కాలంలోనే భగత్ సింగ్ తన తలపాగా తీసేసి, తల జుట్టు,గడ్డం కత్తిరించుకొని, ఓ టోపీ ధరించి బ్రిటిష్ కు వ్యతిరేకంగా యువతను చైతన్యం చేశాడు, యువత కర్తవ్యాన్ని గుర్తు చేసాడు. ఆ తరుణంలోనే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రజా భద్రత బిల్లు, వాణిజ్య వివాద బిల్లుపై చట్టం చేసేందుకు చర్చకు రాగా బిల్లులకు వ్యతిరేకంగా, ప్రజాభిప్రాయాలను ఓ కరపత్రం రూపంలో తెలుపుతూ, కరపత్ర ప్రతులను హాల్లో విసిరి సెంట్రల్ లెజిస్లేటివ్ హాల్లో భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్ పొగ బాంబులు విసిరి బ్రిటిష్ పోలీసులకు పట్టబడతారు. ఇదే అంశంపై భగత్ సింగ్ జీవిత కు జీవిత కారాగార శిక్ష పడుతుంది,  ఆ క్రమంలోనే సాండర్సన్ హత్యా తెరపైకి రావడంతో కారాగార శిక్ష, ఉరిశిక్షకు దారితీసింది. జైలులో రాజకీయ ఖైదీలకు సరైన సదుపాయాలు కల్పించాలని, చదువుకునేందుకు వార్తాపత్రికలు, తగు పుస్తకాలు ఏర్పాటు చేయాలని, ఖైదీల అందరికీ నాణ్యమైన భోజనం అందించాలని నిరాహార దీక్షలు చేస్తారు. 1931, మార్చి 23న బ్రిటీష్ పాలకులు ఉరి తీసారు.

ప్రేరణగా నిలిచిన నేషనల్ కళాశాల- రష్యన్ సోవియట్ విప్లవ స్పూర్తి

లాహోర్ నేషనల్ కళాశాల భగత్ సింగ్ ప్రేరణగా నిలిచింది, కళాశాలలో సుఖదేవ్, భగవతీ చరణ్ వోహ్రా, యశ్ పాల్, జయదేవ్ గుప్తా, రామ్ క్రిషన్ తన తోటి విద్యార్థులు.  నేషనల్ కళాశాలకే మరొక పేరు తిలక్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ గా పిలిచే వారు. 1921 లో లాహోర్ లో ప్రారంభించబడింది. భగత్ సింగ్ అధ్యాపకుల నుండి ప్రేరణ పొందాడు. కళాశాల ప్రిన్సిపల్ చాబిల్ దాస్ రచనల నుండి మరింత ప్రేరణ పొందాడు, చింగారియాన్, మేరీ ఇంక్విలాబ్ యాత్ర వంటి రచనల నుండి స్ఫూర్తిని పొందాడు. ఫ్రొఫెసర్ జై చంద్ర విద్యాలంకార్ రౌలత్ కమిటీ రిపోర్టును తరగతి గదిలో బోధించినప్పుడు విద్యార్థులు రక్త మరిగిపోయేది. భగత్ సింగ్ ను ఓ గొప్ప దేశభక్తుడిగా తీర్చిదిద్దింది ఈ కళాశాల, భగత్ సింగ్ సామ్యవాద ఆలోచనలకు బీజం పడింది ఇక్కడే, అనంతరం రష్యాలో సోవియట్ విప్లవాన్ని అధ్యయనం చేశాడు. రష్యన్ సోవియట్ విప్లవ స్ఫూర్తితోనే స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అనేకమంది దేశభక్తులను ఈ కళాశాల అందించింది. విప్లవకారుల నర్సరీ గా కళాశాలను పిలిచేవారు.

నిరంతర అధ్యయన శీలి భగత్ సింగ్

భగత్ సింగ్(Bhagat singh) నిరంతర అధ్యయనశీలి, విప్లవం కేవలం అధ్యయనం ద్వారా మాత్రమే పురోగమిస్తుందని నమ్మాడు, తన తోటి మిత్రులను అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం చైతన్యం చేసేవాడు. ఆనాటి విప్లవకారులలో, ఇతర రాజకీయ నాయకులలో కెల్లా భగత్ సింగ్  మంచి మేధావి, భాదల నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవాలంటే నిరంతరం అధ్యయనం చేయడమే పరిష్కారమని అన్నాడు. నిరంతరం తన చొక్కా జేబులోనే పుస్తకాలను ఉంచుకొని సమయం దొరికినప్పుడల్లా చదివేవాడు. అతనికి అధ్యయనం పట్ల గల పట్టుదల పాఠశాల, కళాశాల,జైలు నుండి కుటుంబీకులకు, స్నేహితులకు రాసిన అందుబాటులో ఉన్న సుమారు 59 లేఖల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.

భగత్ సింగ్ (Bhagat singh)దేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి?

భారతదేశంలో నేటి యువత ఏమీ తెలియని కూడలిలో నిలబడి ఉంది. డ్రగ్స్,మద్యం,మాదక ద్రవ్యాల మత్తులో మునిగి తేలుతుంది. యువతే దేశానికి ఆయువుపట్టు. నేటి యువతకు భగత్ సింగ్ జీవితమే ఒక ప్రేరణగా నిలుస్తుంది, దేశాభివృద్ధిలో యువకుల పాత్ర ఏమిటో మన యువత గుర్తెరగాలి, దేశం పురోగమించాలంటే యువత ఆలోచనలు, ఎత్తుగడలపైనే ఆధారపడి ఉంది, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే యువతే కీలకం, దేశ  భవిష్యత్తు యువత యొక్క  భుజస్కందాలపై ఉంది. మనిషి ఎంతటి విపత్తులోనైనా తన ఆదర్శలాలకు కట్టుబడి ఉండాలని, త్యాగం లేకుండా ఏది సాధించలేమని, మనిషి జీవితంలో ఎప్పటికీ నిరంతర అధ్యయనశీలిగా ఉండాలని, మీ పట్ల మీరు ఎలా ఉన్నా, ఇతరుల పట్ల సున్నితంగా ఉండాలని భగత్ సింగ్ ఆకాంక్షించాడు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధి  కృషి చేయాలి.

By writer – బి వీరభద్రం

RELATED ARTICLES
- Advertisment -

Latest News