గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(Greater Warangal Municipal Corporation) 46వ డివిజన్ రాంపూర్ మునిసిపల్ డంపింగ్ యాడ్ సమీపంలో కొత్తగా నిర్మించిన బయో మైనింగ్ ప్రాజెక్టు(Bio Mining Project)ను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు(KR Nagaraju) ప్రారంభించారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మడికొండ డంపింగ్ యార్డు (Madikonda Dumping Yard) అంశంపై తాను అసెంబ్లీలో ప్రసంగించానని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఓరుగల్లుకు వస్తుంటే ముఖద్వారం మడికొండ అని, డంపింగ్ యార్డ్‌తో చాలా సార్లు ఫాగ్ మాత్రమే కనిపించేదని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అనేక మార్లు ధర్నాలు చేశారని, తనకు వినతిపత్రాలు అందజేశారని పేర్కొన్నారు. బయో మైనింగ్ మిషన్ల ద్వారా చెత్త నియంత్రణ సాధ్యమవుతుందని వివరించారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంకా ఏమన్నారంటే..
త్వరలోనే మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా డంపింగ్ యార్డ్ సమస్యపై సీఎం మాట్లాడారు. డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడే ఫాగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య గుది బండగా మారింది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోంది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, మామునూరు ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ స్కూల్, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఓరుగల్లులో జరుగుతున్నాయి. ఓరుగల్లు ప్రజలు ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలి. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి 1/3 నిధులు కేటాయించాలి. విలీన గ్రామాలు వేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. విలీన గ్రామాల నుంచి అధికంగా రెవెన్యూ, క్యాంపు డ్యూటీ మునిసిపల్ కార్పొరేషన్‌కు వస్తుంది. ఈ గ్రామాల అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఊరుకోను. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి.
తుఫాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ఇండ్లలోకి నీరు చేరిన వారికి 15 వేల రూపాయలు, రేషన్ అందించాం. మేము నాయకులుగా కాదు ప్రజా సేవకులుగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. హైదరాబాద్‌లో హైడ్రా మాదిరిగానే వరంగల్లో వైడ్రా తీసుకువస్తే ఆక్రమణకు గురైన చెరువులు, నాళాలు తొలగిపోయి వరంగల్ నగరం సురక్షితంగా ఉంటుంది. హైడ్రాపై కొంత మంది నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మలేదు. అసత్య ప్రచారాలు చేసే వారి చెంప చెల్లుమనిపించారు. BRS పార్టీ అభివృద్ధికి ఆటంకంగా మారింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘు చందర్, మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు, నాయకులు, కార్యకర్తలు మడికొండ గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
