Wednesday, March 11, 2026
HomeజాతీయంBhongir MP | టీడీపీ నేత వ్యాఖ్యలపై భగ్గుమన్న భువనగిరి ఎంపీ

Bhongir MP | టీడీపీ నేత వ్యాఖ్యలపై భగ్గుమన్న భువనగిరి ఎంపీ

  • తెలంగాణ ఏర్పాటును అవమానిస్తే సహించేది లేదు:
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న కీలక చర్చ సమయంలో, తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలను భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చరిత్రపై కనీస అవగాహన లేకుండా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ విద్వేషాలు రగిల్చేలా టీడీపీ ఎంపీ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సభలో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని, ఫిబ్రవరి 14, 2014ను ‘బ్లాక్ డే’ అని అభివర్ణిస్తూ నాటి స్పీకర్ మీరా కుమార్ గారిని తప్పుబట్టడంపై శ్రీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలకు పలు సూటి ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ బిల్లు లోక్‌సభలో పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లేఖ ఇచ్చిన వాస్తవం శ్రీకృష్ణ దేవరాయలకు తెలియదా? పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికే ఆయన వ్యతిరేకమా? రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు.

నాడు తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దివంగత నేత సుష్మా స్వరాజ్ లోక్‌సభలో తెలంగాణ గొంతుకగా మారారని బీజేపీ నేతలు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమో కేవలం అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికే టీడీపీ ఎంపీ లోక్‌సభ సాక్షిగా ఈ తరహా చౌకబారు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకేనా ఈ వ్యాఖలు అని ప్రశ్నించారు..

“రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు గడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో హుందాగా, సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయని, ఇప్పుడు మళ్లీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టడం, దానిపై మళ్లీ చర్చ పెట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును అడగడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఏపీ, బీహార్ ప్రజలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌లకు ఓట్లు వేసి గెలిపిస్తే… వారు మాత్రం ఢిల్లీలో మోడీకి మద్దతు తెలుపుతూ ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల సెంటిమెంట్లను ఎందుకు రెచ్చగొడుతున్నారన్నారు.

2014 రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు ఏ వ్యాపారంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని, ఇప్పుడు సభలో ఆయన అవగాహన ఉండి మాట్లాడారా, అవగాహన లేక మాట్లాడారా అనేది టీడీపీ నాయకత్వం వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇంకోసారి మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదని,ఎవరి రాజకీయ స్వలాభం కోసమో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్లీ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు.
మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చామల కిరణ్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News