తెలంగాణ కుంభమేళా(Telangana Kumbhmela)గా పేరొందిన మేడారం మహాజాతర(Medaram Mahajatara)లో గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Deputy CM Mallu Bhattivikramarka) సతీసమేతంగా పాల్గొన్నారు. అశేష భక్తజనవాహిని నడుమ సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) అమ్మవార్లను దర్శించుకున్నారు. గద్దెల వద్ద భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. దర్శనం అనంతరం, మేడారం మహా జాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లను డిప్యూటీ సీఎం స్వయంగా పర్యవేక్షించారు. జాతర ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి భద్రత, క్రమశిక్షణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీరు, రవాణా సదుపాయాలు, క్యూలైన్ల నిర్వహణ, పారిశుధ్యం వంటి అంశాల్లో అన్ని చర్యలు పకడ్బందీగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు అమ్మవార్ల దర్శనం సురక్షితంగా, సులభంగా జరిగేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతని భట్టి తెలిపారు.
