- తొగర్ల చిరంజీవులు, ఐఏఎస్(రిటైర్డ్), బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మబలిదానం చేయటం బాధాకరమని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం (BC Intellectual Forum) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ తొగర్ల చిరంజీవులు (Chiranjeevulu) ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అభిప్రాయపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే బాధతో ఈ నెల 4న హైదరాబాద్ శివారు పీర్జాదిగూడలో సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ, బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం సమాజానికి బాధాకరమని తెలిపారు.
‘తెలంగాణ సాధన(Telangana Movement)లో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు ప్రాణాలు అర్పించారు. ఇలాంటివి ఇక చాలు. భవిష్యత్తులో బలిదానాలు కాదు. పోరాటమే మార్గం. మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన గౌరవం ఆత్మహత్యలతో రాదు. ఐక్యత, స్ఫూర్తి, రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. లక్ష్యం సాధించాలంటే బలంగా, చైతన్యంగా, ఒక్కటిగా నిలబడాలి. ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం (Self Respect) ద్వారా, మన పోరాటం ద్వారా నిర్మించబడుతుంది.
1.. హిస్సా 2.. ఇజ్జత్ 3.. హుకుమత్‌ల కోసం అందరం కలిసి పోరాడదాం. మన హక్కులను పోరాటం ద్వారా సాధించుకుందాం. మన ప్రాణ త్యాగాల ద్వారా కాదు. మన రాజకీయ సంకల్పం, నిస్వార్థ పోరాటం ద్వారానే లక్ష్యాన్ని చేరుకుందాం. తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు. పాలన, గౌరవం, న్యాయం, హక్కులకు అడ్డా కావాలి. మోసం చేసినవారికి ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి. మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుద్దాం, మన ఆశయాన్ని సాధిద్దాం. చివరిగా ఒక మాట. ప్రాణం విలువైంది. పోతే తిరిగి రాదు. పోరాటం పవిత్రమైంది. ఆత్మబలిదానం దానికి మార్గం కాదు. జై ఫూలే. జై అంబేడ్కర్’ అని చిరంజీవులు అన్నారు.
