Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNaveen Yadav | బీసీ బిడ్డకు పట్టం

Naveen Yadav | బీసీ బిడ్డకు పట్టం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం
రాష్ట్రవ్యాప్తంగా బలపడనున్న బీసీ రిజర్వేషన్ల ఉద్యమం
బైఎలక్షన్ వేదికగా ఏకతాటిపైకి వచ్చిన అన్ని బీసీ సంఘాలు
పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్‌కి బీసీల సంపూర్ణ మద్దతు
ఉపఎన్నికలో ముందుండి నడిపించిన పలువురు మంత్రులు
పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి, వాకిటి, వివేక్
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీహెచ్ లాంటి సీనియర్ నేతలు
సినిమా, టీవీ రంగాల తరఫున ఆద్యంతం సపోర్ట్ చేసిన హీరో సుమన్
బీసీ క్యాండేట్ సక్సెస్ కోసం ఇంటింటి ప్రచారంలో కదం తొక్కిన..
మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి(Congress Party Candidate), బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపొందటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana State Politics) కీలక మలుపు(Turning Point)గా చెప్పుకోవచ్చు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమం (BC Movement) గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఊపందుకున్న సమయంలో తెర మీదికి వచ్చిన ఈ బైఎలక్షన్.. బీసీల ఐక్యతను ఘనంగా చాటిచెప్పింది. బీసీల డిమాండ్‌లో న్యాయం ఉందంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు, సినిమా, టీవీ తదితర రంగాల వాళ్లు ఏకతాటి మీదికి వచ్చి నవీన్ యాదవ్‌కి ఘన విజయం కట్టబెట్టారు. అన్ని బీసీ సంఘాలతోపాటు ఎమ్మార్పీఎస్(Mrps) లాంటి ఇతర సంస్థలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి వెన్నంటి నడిచి పట్టం కట్టాయి.

- Advertisement -

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో (లక్షకు పైగా) ఉన్న ముస్లింలు (Muslims) సైతం బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను బలపరిచారు. మతం ప్రాతిపదిక హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించిన బీజేపీకి బుద్ధి చెప్పి లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్‌కి పెద్ద సంఖ్యలో ఓటేసి నవీన్ యాదవ్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. క్రైస్తవులు కూడా పోలింగ్‌కి ముందే బీసీ యూత్ లీడర్ నవీన్ యాదవ్‌కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. మహిళలు, యువతీయువకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బీసీ ఆశాకిరణం నవీన్ యాదవ్‌కి గెలుపు బాట వేశారు. కళాకారులు తమ పాటలు, ప్రదర్శనలతో ప్రజల్లో ఉత్సాహం నింపారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్, అజారుద్దీన్‌లతోపాటు వి.హనుమంతరావు లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ ఉపఎన్నిక సందర్భంగా మొదటి నుంచి బీసీ భావజాలాన్ని బలపరిచారు. హీరో సుమన్ సైతం తొలి నుంచి నవీన్ యాదవ్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. దేశంలో తొలిసారి బీసీ కులగణన చేపట్టిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సాహసోపేత నిర్ణయం వెనక పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తగ్గట్లే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి హైకమాండ్ మరింత ప్రోత్సహించింది.

జూబ్లీహిల్స్‌లో బీసీ భవిష్యత్ నేత నవీన్ యాదవ్‌కి సక్సెస్‌ని కట్టబెట్టడం ద్వారా ఆయన్ని అసెంబ్లీకి పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల నుంచి వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మార్పు మాదిరిగా జూబ్లీహిల్స్‌లోనూ సరికొత్త తీర్పు ఇవ్వాలని ఓటర్లు కోరారు. ఈ రోజు బీసీలు రాజకీయాల్లో పైకొస్తే రేపు మన వంతు కూడా వస్తుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు.. ఇలా అన్ని శ్రేణులు కదం తొక్కటంతో నవీన్ యాదవ్ సక్సెస్‌ అయ్యారు.

రెడ్డి సామాజికవర్గం తరఫున తెలంగాణ రాష్ట్రానికి తాను చివరి ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న ప్రేమను బలంగా తెలియజేసింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లటంతో బీసీల్లో హస్తం పార్టీపై ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందించింది. తాజాగా.. జూబ్లీహిల్స్‌లో బీసీ యువనేత గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మెజారిటీని సాధించటం విశేషం. ఈ ఘన విజయం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాన్ని ఇచ్చింది.

టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని బీసీ నాయకుడు(మహేష్ కుమార్ గౌడ్)కి ఇవ్వటం ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు భవిష్యత్‌లో ఇవ్వబోయే ప్రాధాన్యతను ఏడాది కిందటే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీసుకోవటానికి రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటం కూడా ప్రభావం చూపింది. ఇదే ఊపులో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా మోదీ సర్కారుపై ఒత్తిడి తెస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తుంటే తెలంగాణలో రాజ్యాధికారం బీసీలకు మరెంతో దూరంలో లేదనేది ఇట్టే తెలిసిపోతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News