- సీఎం కి లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
- రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ చెల్లించకుండా వేధిస్తున్నారు..
- రెండెళ్లయినా బకాయిలను ఎందుకు చెల్లించడం లేదు..?
- మీ నిర్లక్ష్యం కారణంగా 61 మంది తనువు చాలించారు..
- రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా?
- ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ
( జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిది.. ముక్కు మొఖం తెలియని వృద్ధులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనది : బండి సంజయ్ )
తెలంగాణాలో పదవీ విరమణ చేసిన లక్షలమంది ఆర్తనాదాలు పట్టించుకోండి అని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక లేఖరాశారు.. తెలంగాణలోని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల వెతలను మీ ద్రుష్టికి తీసుకురాదలిచాను. రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్ లో ఉంచింది.
ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదు. 2023 జులై నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. కనీసం పీఆర్సీ రిపోర్ట్ ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్ధం చేసుకోవచ్చు అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు..
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే….జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2024 నుండి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. ఆనాటి నుండి నేటి వరకు వారికి రావాల్సిన బెన్ ఫిట్స్, 5 డీఏలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం కోసం, ఉన్నత చదవులు చదివించడం కోసం దాచుకున్న సొమ్మును చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిది. ముక్కు మొఖం తెలియని వ్రుద్దులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనది. అట్లాంటిది జీవితాంతం ప్రభుత్వానికి ఊడిగిం చేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారిని బెన్ ఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ..
వారి ఉసురు పోసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వం ఉన్న పాలకులెవరూ ఇంతటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించరు. మీ నిర్లక్ష్యంవల్ల బెన్ ఫిట్స్ అందక గత ఏడాది నుండి ఇప్పటి వరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? వారిపై ఆధారపడిన కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారు? ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపట్ల పాలకులు ఇంతటి కర్కశంగా వ్యవహరించడం తెలంగాణకు మాయని మచ్చ తెస్తుందనే విషయం మరిచిపోయారా? అని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్..
రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా భావించడం అంటే…అంతకంటే దురద్రుష్టకరమైన విషయం ఇంకోటి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నట్లు కన్పిస్తొంది.
ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పురోభివ్రుద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుంది. ఇకనైనా వారిపట్ల రేవంత్ కు ఉన్న నిర్లక్ష్య ధోరణిని విడనాడి బకాయిలన్నీ చెల్లించాలని ఆ లేఖలో కోరారు.. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ బకాయిలను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని యుద్ద ప్రాతిపదికన చెల్లించాలని విజ్ఝప్తి చేశారు..
లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.. అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఆయా ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకునేందుకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని కూడా బండి హెచ్చరించారు..
