- బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయండి.. మాట ఇస్తే… తప్పే ప్రసక్తే లేదని వెల్లడి.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని మాట తప్పిన బీఆర్ఎస్..
- కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు.. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే : కేంద్రమంత్రి బండి సంజయ్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాటను తప్పనని, చెప్పినదే చేసే నాయకుడినని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 70 గ్రామాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేయించుకున్నప్పటికీ, ఐదేళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
అంతకుముందు కాంగ్రెస్ కూడా ఇదే తరహా హామీలు ఇచ్చి ప్రజలను మోసపరిచిందని ఆరోపించారు. దీంతో ఏకగ్రీవం చేసిన పంచాయతీల అభివృద్ధి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలనలో కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి “రాష్ట్ర ఖజానాలో పైసల్లేవు” అని చెప్పిన విషయాన్ని ఉదహరించారు. బీఆర్ఎస్ పాలనలో కూడా గ్రామ స్థాయి అభివృద్ధికి నిధులు రాక, అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచ్లు కష్టాల పాలైన ఉదంతాలను గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని, గ్రామాల్లో జరుగుతున్న పనులన్నీ ఎక్కువగా కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా కేంద్ర నిధులే ప్రధాన కారణమని అన్నారు.
ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రస్తుతం లేనందున, తమవద్ద మాత్రం ఎంపీ లాడ్స్లో పాటు భారీగా సీఎస్ఆర్ నిధులను తెచ్చి ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తున్నట్టు వివరించారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయితే, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, అలాగే కేంద్రం నుండి మరిన్ని నిధులు తెచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చివరిగా, “గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది బీజేపీ మాత్రమే. ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే కొత్త నిధులు రాకపోవడంతో పాటు, వచ్చే కేంద్ర నిధులపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకుని బీజేపీ అభ్యర్థులను గెలిపించండి” అని ప్రజలను పిలుపునిచ్చారు.
