- ఉపఎన్నిక ఫలితంపై బండి కీలక వ్యాఖ్యలు
- హిందువులంతా ఓటు బ్యాంక్ కావాలి
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరినవారు ఘర్ వాపసీ రండి
- హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం
- మతాలను మార్చుకుంటే మోసం చేసినట్టే
- కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ‘జూబ్లిహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగింది. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందే!’ అని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులారా ఘర్ వాపసీ రావాలని పిలుపునిచ్చారు. హిందూవులు మతం మార్చుకోరాదని సూచించారు.
కూకట్పల్లిలో ఆదివారం నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వనభోజనాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంక్ మారాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమై నేపథ్యంలో, ఆ ఫలితాల తరువాత “హిందువుల్లో కసి పెరిగింది” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్లో “ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడింది” అంటూ విమర్శలు చేశారు. ఇకనైనా హిందువులు మేల్కొని ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందన్నారు. మతాన్ని మార్చుకోవడం దేవుళ్లను మోసం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లోకి వెళ్లిన వారంతా ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. తిరిగి రావాలనుకునే వారికి హిందూ ధర్మ రక్షణ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు.
హిందూ సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూ, “హిందువుగా పుట్టడం గర్వకారణం” అని బండి సంజయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేస్తున్న ప్రచారం కారణంగా ఇతర మతాల్లో చేరిన కొంతమంది హిందువుల్లో పునరాలోచన మొదలైందని వెల్లడించారు. మోసపోయి ఇతర మతాల్లోకి వెళ్లినవారిని ఆదుకోవడం తమ బాధ్యతేనని ఆయన భరోసా ఇచ్చారు. కులాల ఆధారంగా సమాజ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తప్పులేదని, అయితే అందరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన జీవిత లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
