రేపు బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని బాల్కొండ శాసనసభ నియోజకవర్గ(Balkonda Assembly Constituency) ప్రజలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashant Reddy) విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్(Congress).. హామీలను నెరవేర్చకుండా అందరినీ మోసం చేసిందని, అందువల్ల ఆ పార్టీ సపోర్ట్ ఉన్న అభ్యర్థులను ఓడించాలని కోరారు. మానాలా గ్రామ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి గ్యారంటీ కార్డులు (Guarantee Cards) ఇచ్చిన కాంగ్రెస్ నాయకులే.. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారని గుర్తుచేశారు.
మోసం చేసిన ఆ నాయకులకే మళ్లీ ఓటేద్దామా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అని అన్నారు. వేల్పూర్ మండలం జానకంపేట్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, వార్డ్ మెంబర్లు సౌడ రాకేష్, ఎడ్ల ఓపెష్, తలారి గంగాధర్, వేణు.. వేల్పూర్‌లో వేములను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు నాగాధర్ రెడ్డి, సౌడ రమేష్, కొలిపాక శ్రీనివాస్, సత్యం, డైరెక్టర్ శేఖర్, శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
