- మేమెంతో మాకంత వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.
- టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్.
బహుజనుల చైతన్యంతోనే రాజ్యాధికారం దక్కుతుందని, మేమెంతో మాకంత వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ స్పష్టం చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని టీఆర్పీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు నూతన సంవత్సరం శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
ఏడు దశాబ్దాలకు పైగా జనాభాలో సింహభాగంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను అగ్రకులాలు రాజకీయ పావులుగా వాడుకోవడం వల్లే బహుజనులు రాజ్యాధికారానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో సముచిత వాటా దక్కాలనే లక్ష్యంతో బీసీల పక్షపాతిగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో టీఆర్పీ పార్టీని ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి చేసుకున్నామని, ఈ తక్కువ సమయంలోనే ఎన్నో కీలక విజయాలు సాధించామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రతి ఏడాది 20 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కిందని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే కృతనిశ్చయంతో తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందేలా టీఆర్పీ వ్యూహ రచన చేస్తోందని తెలిపారు.
రాబోయే రోజుల్లో బహుజన కులాలకు న్యాయం జరిగేలా రాజ్యాధికారం దిశగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్‌పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, కోల కరుణాకర్, లింగాల సైదులు, జానకి రాములు, మల్లేష్, వర్రె కవిత, మీర్ పర్వీన్, బాల్మీకి దీపమాల, సంజన, బొమ్మగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.
