Wednesday, February 11, 2026
Homeఆరోగ్యంRare Event | గర్భ నిరోధక సాధనానికే సవాలు విసిరిన శిశువు

Rare Event | గర్భ నిరోధక సాధనానికే సవాలు విసిరిన శిశువు

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లయింది బ్రెజిల్‌(Brazil)కు చెందిన క్వైడీ అరౌజో డి ఒలివీరా అనే మహిళ పరిస్థితి. ఈమె ఇప్పుడే సంతానం వద్దనుకొని దాదాపు రెండేళ్లుగా ఇంట్రా యూటెరైన్ డివైజ్(Intra Uterine Device-IUD) లేదా కాపర్ కాయిల్ (Copper Coil) అనే గర్భ నిరోధక సాధనాన్ని (Contraceptive) ఉపయోగిస్తున్నా ఆమె ప్రయత్నాలు విఫలమై పండంటి మగ శిశువును ప్రసవించింది.

డెలివరీ రూమ్‌(Delivery Room)లో గర్భ నిరోధక కాయిల్‌ను చేతిలో పట్టుకున్న ఆ బుడతడి ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ (Viral) అయింది. ఈ విషయాన్ని మిర్రర్ (Mirror) పత్రిక ప్రచురించింది. సాధారణంగా ఐయుడీ గర్భనిరోధక సాధనాలు 99 శాతానికి పైగా విజయవంతంగా గర్భాన్ని నిరోధిస్తాయని నిరూపితమైంది. ఇలాంటి అరుదైన ఘటన(Rare Event)లు పది లక్షల మందిలో ఒకరికి జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

ఐయుడీ అంటే ఏంటి? అవి ఎలా పని చేస్తాయి?

గర్భాశయ పరికరం లేదా ఐయుడీ అనేది గర్భధారణను నివారించడానికి గర్భాశయం లోపల ఉంచే ఇంగ్లిషు అక్షరం ‘T’ ఆకారంలో ఉండే చిన్న జనన నియంత్రణ పరికరం. వీటిలో రాగి ఐయుడీ, హార్మోన్ల ఐయుడీ అని రెండు రకాలు ఉంటాయి. మాయో క్లినిక్ ప్రకారం.. రాగి ఐయుడీలు రాగి అయాన్‌లను విడుదల చేయడం ద్వారా పనిచేస్తాయి. ఇవి వీర్యకణాలు అండాన్ని చేరుకోవడాన్ని నిరోధించి ఫలదీకరణ ప్రక్రియ కష్టతరమయ్యే ప్రతికూల పరిస్థితులను కల్పిస్తాయి.

మరోవైపు.. హార్మోన్ల ఐయుడీలు ప్రొజెస్టిన్‌ను విడుదల చేస్తాయి. ఇది గర్భాశయ శ్లేష్మాన్ని చిక్కగా చేసి వీర్య కణాలను నిరోధించడానికి గర్భాశయ పొరను పలుచబరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఐయుడీ అనేది అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతుల్లో ఒకటి. దీని కాల పరిమితి రకాన్ని బట్టి 5 నుండి 10 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ గర్భ నిరోధక పద్ధతిని ఆశ్రయించిన మహిళ.. గర్భం ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని సులభంగా తొలగించుకోవచ్చు.

క్వైడీ గర్భిణీ అని ఎలా తెలిసింది?

ఒక సాధారణ పరీక్షల సమయంలో క్వైడీ గర్భవతి అని తేలింది. అయితే ఆ పరిస్థితుల్లో గర్భ నిరోధక కాయిల్‌ను తొలగించడం వల్ల గర్భధారణ ప్రమాదంలో పడుతుందని, అబార్షన్‌కు దారితీయొచ్చని వైద్యులు సూచించడంతో ఆమె దాన్ని అలాగే తన గర్భాశయంలో ఉంచుకునేందుకు నిర్ణయించుకుంది. దీని కారణంగా ఆమెకు రక్తస్రావం, పరికరం పాక్షికంగా వేరుపడటం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ.. చివరికి గర్భనిరోధక కాయిల్‌ సహా మగశిశువు మాథ్యూస్ ప్రసవం సురక్షితంగా జరిగిపోయింది.

విజయ ట్రోఫీతో నవజాత శిశువు

క్వైడీ ప్రసవం తర్వాత కాన్పు జరిపిన డాక్టర్ నటాలియా రోడ్రిగ్స్ గర్భ నిరోధక ఐయుడీని గమనించి, దాన్ని నవజాత శిశువు మాథ్యూస్ చేతిలో ఉంచారు. ప్రసూతి గదిలో డాక్టర్ తీసిన ఫోటోలో మాథ్యూస్ గర్భ నిరోధక సాధనాన్ని తన చిట్టి చేతుల్లో ఒక ట్రోఫీలా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ‘నా ఉనికిని అడ్డుకోజాలని ఐయుడీ: నా విజయ ట్రోఫీతో నేను!’ అన్న శీర్షికతో డాక్టర్ రోడ్రిగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ చిత్రాన్ని షేర్ చేశారు. ఏమయితేనేం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని తేలడంతో దీనికి శుభం కార్డు పడినట్లయింది.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

- Advertisement -
RELATED ARTICLES

Latest News