- ఐక్యమత్యం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘన నివాళి
జవహర్ నగర్ సర్కిల్‌లో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహనీయుల ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐక్యమత్యం ఆటో యూనియన్ సభ్యులు భారీగా పాల్గొని బాబుజీకి నివాళులు అర్పించారు. యూనియన్ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చి బాబుజీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఐక్యమత్యం ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్ట కృపవారం విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి ఉపప్రధానిగా బాబుజీ అందించిన సేవలు చిరస్మరణీయమని, కార్మిక చట్టాల రూపకల్పనలో ఆయన పాత్ర శ్రమజీవులకు రక్షణగా నిలిచిందన్నారు.

మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మండల సురేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషిని గుర్తుచేసి ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పరశురాం, బూడిద వెంకటేష్ మాట్లాడుతూ బాబుజీ ఆశయాలను గ్రామగ్రామాన చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు కూరాకుల నర్సింగ్ రావు, కానాపూర్ మారుతి, బి శ్రీనివాస్, రాజసేన్, శేఖర్ పాల్గొన్నారు.
జిహెచ్ఎంసి, జెఎంసి విభాగానికి చెందిన కృష్ణమూర్తి, కిషోర్, భారతి, మధు, గణేష్, రత్తుమ్మ పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆటో కార్మికులు తమ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా కార్మిక శ్రేయస్సే లక్ష్యంగా ఐక్యమత్యం ఆటో యూనియన్ సభ్యులు ఐక్యతను చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఆటో కార్మికులు, యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
