- మహిళా అధికారిణికి సంబంధం..
- ఆయనకు గొడుగుపెట్టిన ఫోటోలు వైరల్..
పలువురు మహిళలపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్కుడైన అశోక్ ఖరత్‌తో ఒక మహిళా అధికారిణికి ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలి చకన్కర్ ఆ జ్యోతిష్కుడికి గొడుగు పట్టిన ఫొటో వైరల్ అయ్యింది. అశోక్ ఖరత్ ట్రస్ట్‌తో ఆ అధికారిణికి సంబంధం ఉన్నట్లు కూడా బయటపడింది.
కాగా, జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో తన సంబంధం పరిమితమని, ఆయనపై ఆరోపించిన నేరాల గురించి తనకు ఏమీ తెలియదని రూపాలి తెలిపారు. సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా ఎలాంటి నిర్ధారణలకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్టం దాని పనిని అది చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
మరోవైపు రూపాలి చకన్కర్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అశోక్ ఖరత్, ఆయన ట్రస్ట్‌తో ఆమెకు ఉన్న సంబంధంపై విచారణ జరుపాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ దీనిపై స్పందించారు. ‘ఇవి రెండు వేర్వేరు అంశాలు. లైంగిక వేధింపుల కేసు విచారణలో ఉన్నది. దానిని క్షుణ్ణంగా విచారిస్తాం. ట్రస్టీగా ఆమె పాత్రలో ఏదైనా చట్టవిరుద్ధం ఉంటే దానిని కూడా పరిశీలిస్తాం’ అని మీడియాతో అన్నారు.
కాగా, పదవీ విరమణ పొందిన మర్చంట్ నేవీ అధికారి అశోక్ ఖరత్ ప్రముఖ జ్యోతిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. 35 ఏళ్ల మహిళపై మూడేళ్లకు పైగా పలుమార్లు అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై బుధవారం నాసిక్ జిల్లాలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో 58 మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు గుర్తించారు. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే గతంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆ జ్యోతిష్యుడిని సందర్శించారు. తాజాగా అశోక్ ఖరత్‌తో కలిసి రూపాలి చకన్కర్ ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
