- ప్రభుత్వానికి పద్మారావు గౌడ్ హెచ్చరిక
- సికింద్రాబాద్ బచావో ఉద్యమం ఉదృతం చేశామని వెల్లడి
- సికింద్రాబాద్ చరిత్రను చెరిపేస్తామంటే ఊరుకోము
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శనివారం నిర్వహించతలపెట్టిన ర్యాలీ కి పోలీసులు అనుమతి నిరాకరించడం పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మోండా మార్కెట్ లోని పద్మారావు గౌడ్ నివాసం వద్ద శనివారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయనను ఇంటి నుంచి వెళ్ళకుండా అడ్డుకోవడంతో పెద్ద సంఖ్యలో నేతలు,కార్యకర్తలు పద్మారావు గౌడ్ నివాసానికి చేరుకొని సంఘీభావంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.సికింద్రాబాద్ ప్రాముఖ్యతను కనుమరుగు చేసేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం విడ్డూరమని విమర్శించారు.సికింద్రాబాద్ ఉనికిని చాటుకొనేందుకు ఉద్యమిస్తామని తెలిపారు.ర్యాలీకి అనుమతించకుండా తమ పార్టీ నేతలు,కార్పొరేటర్లు,కార్యకర్తలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం,అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు.ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేస్తే తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు.
తెలంగాణ భవన్ నుంచి అందిన సమాచారం మేరకు ర్యాలీని రద్దు చేసుకున్నామని తెలిపారు.పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్,చిలకలగూడ,గోషామహల్,మోండా మార్కెట్ వంటి వివిధ పోలిస్ స్టేషన్ లకు తరలించిన తమ పార్టీ నేతలు,కార్యకర్తలను వెంటనే విడుదల చేసియాలని పద్మారావు గౌడ్ డిమాండు చేశారు. కాగా పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు,బీ.ఆర్.ఎస్. నాయకులు,పద్మరావు గౌడ్ నివాసానికి చేరుకొని నినాదాలు చేశారు.

