- పడగొట్టినవి నిలబెడదాం
- 10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు
- పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి
- 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు లక్ష్యంగా ప్రణాళికలు
- గ్రామీణ రహదారుల నెట్‌వర్క్, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి
- రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
గ్లోబల్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు(Horticultural Products) పండించాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని చెప్పారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.
పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, చాలా వరకు ప్రాజెక్టులను పెండింగులో పెట్టేసిందని మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అలాగే తక్కువ నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. ఈ దిశగా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, అలాగే 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు.
సీమ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలవరం కుడి కాల్వ పనులు పూర్తయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చన్నారు. అప్పుడు పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చని సూచించారు. ఈలోగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం సూచించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు తెలిపారు. అలాగే ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్‌గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రాయలసీమ ప్రాంతం ఉద్యాన రంగంలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం మెండుగా కన్పిస్తోందని, దీనికి అనుగుణంగా ఎకో సిస్టం అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
స్థానికంగా ఉద్యాన రంగ అభివృద్ధికి అవసరమైన రూరల్ రోడ్ నెట్ వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్ కనెక్టివిటీ, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. పూర్వోదయ ద్వారా వచ్చే నిధులతోపాటు ఉద్యాన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సాధించాలని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ తదితర లాజిస్టిక్స్ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్ సహా ఆర్థిక, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పోర్టులు, ఆర్ అండ్ బి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు..
- వెలిగొండ ప్రాజెక్ట్
- కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
- పాలేరు రిజర్వాయర్
- మల్లెమడుగు లిఫ్ట్-రిజర్వాయర్
- శ్రీ బాలాజీ రిజర్వాయర్
- కుప్పం బ్రాంచ్ కెనాల్
- పుంగనూరు బ్రాంచ్ కెనాల్
- మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
- హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పనులు
- అట్లూరుపాడు-మెర్లపాక ఎస్ఎస్ఎల్సీ
- నీవా బ్రాంచ్ కెనాల్ పనులు
- జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
- జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు
- అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్
- మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు
- పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
- కడప, కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి
- అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్దరణ పనులు
- పశ్చిమ కర్నూలుకు నీళ్లిచ్చేలా వేదవతి-అలగనూరు-గాజులదిన్నె ప్రాజెక్టులు
- ఏడు జిల్లాల్లో 1011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి
