చినిగిన చొక్కా అయినా తొడుక్కో. కానీ.. ఓ మంచి పుస్తకం (Good Book) కొనుక్కో. అది స్నేహితుడి(Friend)తో సమానం. జీవితాన్ని (Life) మారుస్తుంది’ అని కందుకూరి వీరేశలింగం పంతులు (Kandukuri Veeresalingam Panthulu) చెప్పిన మాటలు నేటికీ పుస్తక ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. “పుస్తకాలు దీపాల (Lights) వంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటి(Dark)ని తొలిగిస్తుంది” అని చెప్పిన భారతరత్న, ప్రపంచ మేధావి అంబేద్కర్(Ambedkar) మాటలు మనకు నిత్య జ్ఞాపకాలే. పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆనందాన్నిస్తుంది, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలవాట్లను మారుస్తుంది.
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధిగా, జ్ఞానాన్ని పంచే మాధ్యమంగా పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం. కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ తదితరాలు ఎన్ని దరిజేరుతున్నా పుస్తకం విలువ మాత్రం చెక్కుచెదర లేదు. మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞాన సముపార్జన తృష్ణ మొదలైందంటే తుది వరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య నూతన విజ్ఞానాన్ని అందించేది పుస్తకం.
అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మానవుడి భావనా తరంగాలను ఇతరులు స్పష్టంగా చదవగలిగే ఒక కెమెరా దృశ్యాలు మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదవగలిగే సాధనం అక్షరం. మనిషి ఆయువు వందేళ్లయితే గ్రంథం ఆయువు అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ గ్రంథ పూజను పుస్తకాల (సరస్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రు్లో నిర్వహించే ఆచారం కొనసాగుతోంది.
గ్రంథం పొరపాటున కాలికి తగిలితే కళ్లకు అద్దుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది. గ్రంథానికి వయసనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకొని 2300 ఏళ్ల క్రితం కౌటిల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం హాలుని ”గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాల లాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి.
భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా భారతదేశాన్ని జయించడానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువు అరిస్టాటిల్ మన దేశ తత్వ సాహిత్యాన్ని తిరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు విదేశీ యాత్రికుల సందర్శనలకు హేతువులయ్యాయి. చైనా, టిబెట్, అఫ్ఘనిస్థాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతోపాటు ఇక్కడి బౌద్ధ సాహిత్యాన్ని మూల, అనువాద రూపాల్లో తీసుకెళ్లారు.
అక్షరాన్ని కనుక్కోవటానికి ముందు వేద వాఙ్మయం శృత సాహిత్యంగా ఉండేది. శృతం లిఖితం కావడం మానవ సంస్కృతీ వికాస పరిణామాల క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రస్తాన త్రయం, భారత, భాగవత, రామాయణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం గ్రంథ రూపం సంతరించుకున్నాక, ప్రపంచంలో ఏ జాతీ, ఏ దేశం, భారతదేశానికి సాటి రావని సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది.
భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు నలంద, తక్షశిల తదితర విశ్వవిద్యాలయాల్లో భద్రపరచబడి కొన్ని విదేశీ, విమతాల దాడుల్లో నశించాయి. మానవుడి ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలా సార్లు మాడి మసైపోయింది. నేపాల్ విశ్వవిద్యాలయ గ్రంథాలయ భవనం ముందు 50 వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విషాద ఘటన. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతులు ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథం వందలాది ప్రతులు సిద్ధమయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకుముందు రాజాస్థానాల్లో ప్రతులు తయారుచేసే ఉద్యోగులు ఉండేవారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహుకష్టంతో కూడుకునేది.
గ్రంథస్థ విషయాలు ప్రపంచమంత విస్తృతం, ప్రపంచవ్యాపితం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మికాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటే మిటి.. వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతుంది.
అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు. ఈ విషయాలను అర్థంచేసుకొని, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా (On The Occasion Of National Library Week) పఠనాసక్తిని పెంపొందించే కృషి జరగాలి. అలాగే అపూర్వ, అపురూప, అమూల్య ప్రాచీన గ్రంథాల పరిరక్షణ పట్ల బాల్యం నుండే పిల్లల్లో అవగాహన కల్పించాలి.
(జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
