- బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
- యాంటీ ర్యాగింగ్ కమిటీని పటిష్టపరచాలి
- సెక్యూరిటీ చీఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలి
- అడ్మినిస్ట్రేషన్ విఫలం వల్లే ఇలాంటి సంఘటనలు
- బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్
కరీంనగర్, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్ ): నాచుపల్లి శివారులోని కొండగట్టు జేఎన్టీయూ(Jntu) క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై విచారణ జరిపించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (Bsf) డిమాండ్ చేసింది. సీనియర్ విద్యార్థులు.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ (Ragging) చేసిన ఘటనపై యూనివర్సిటీ అధికారులు పోలీసులతో విచారణ (Enquiry) జరిపించాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, యువ న్యాయవాది జక్కనపల్లి గణేష్ కోరారు. ఇద్దరు జూనియర్ విద్యార్థులతో పెళ్లి చేస్తున్నట్లు తంతు జరిపించి, చున్నీలు వేసుకొని డ్యాన్స్ చేసి, దీన్ని వీడియో తీసి, సీనియర్ విద్యార్థులు పోస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
ఈ ఘటన జరిగి 4 రోజులు అయినా ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా అధికారుల చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. క్యాంపస్ సెక్యూరిటీ చీఫ్ ఇటీవల విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించాడని, దీనిపై విద్యార్థులు ఆందోళన కూడా చేశారని పేర్కొన్నారు. క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటుచేసి ర్యాగింగ్‌ను పూర్తిగా నిరోధించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
