- అమీన్ పూర్‌లో వెలుగు చూసిన అడ్డగోలు దందా..
- మట్టితో చెరువును పూడ్చి అక్రమ నిర్మాణాలు చేస్తున్న కృష్ణంరాజు..
- చెరువులో బోర్లు వేసి నీళ్ల దందా చేస్తున్న కబ్జా కోర్..
- అవినీతి మత్తులో జోగుతున్న ఇరిగేషన్ ఏ.ఈ
- సైన్ బోర్డు ఏర్పాటు చేసి,కేసు నమోదు చేయని హైడ్రా..
- అక్రమ నిర్మాణాలు కూల్చి వేసి అక్రమంగా వేసిన బోర్లను తొలగించాలంటూ వెల్లువెత్తిన డిమాండ్స్..
- మున్సిపల్ అధికారులు కూల్చి వేసినా ఆగని కబ్జా పర్వం..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఉన్న పెద్ద చెరువుపై కృష్ణంరాజు కన్ను పండిరది.. రౌడీలను పెట్టీ అక్రమ నిర్మాణాలు చేస్తూ చెరువును పట్టపగలే పూడ్చి వేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.. దర్జాగా మట్టితో చెరువులను పూడ్చి అందులో బోర్లను వేస్తూ అక్రమంగా నీటిని అమ్ముకుంటూ అక్రమాలకు తెరలేపాడు ఈ కబ్జాకోర్.. కళ్ళెదుట చెరువును మట్టితో పూడ్చి కబ్జా చేసినా ఇరిగేషన్ ఏ.ఈ. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.. యదేచ్ఛగా అక్రమాలు చేస్తుంటే ఇరిగేషన్ ఏ.ఈ ఆ వైపు కెన్నెత్తి చూడక పోవడంతో స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లు ఉందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కబ్జాలకు పరోక్ష సహకారం అందిస్తూ కృష్ణంరాజు చేస్తున్న కబ్జాలపై నేటికి ఒక్క కేసు నమోదు చేయలేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి..

అనుమతులు లేకుండా అడ్డగోలుగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. స్థానిక మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే అదే రోజు సాయంత్రం రౌడీలను పెట్టీ కబ్జాలు చేస్తున్నాడని ఈ ప్రాంత ప్రజలు మండి పడుతున్నారు.. చెరువులను పరిరక్షించాల్సిన హైడ్రా ఖాళీగా ఉన్న పార్కులకు బోర్డులు ఏర్పాటు చేసి కబ్జాలను కట్టడి చేస్తున్నామంటూ కలరింగ్ ఇస్తున్నారని పలువురు సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు.. కనీసం హైడ్రా అధికారులు నేటికి ఒక్క సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులను పరిరక్షించడంలో భాగంగా కృష్ణం రాజుపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్థానికంగా ఉండే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
అక్రమంగా వేసిన బోర్లను తక్షణమే తొలగించి అక్రమ నీటి దందాను కట్టడి చేయాలని.. లేకపోతే భవిష్యత్ తరాల ప్రజలకు నీటి ఎద్దడి సమస్య తప్పదని అధికారులకు గుర్తు చేస్తున్నారు.. ఈ అక్రమ వ్యవహారంపై వివరణ కోరితే ఇరిగేషన్ ఏ.ఈ. స్పందించలేదు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ చెరువును పూడ్చి నిర్మాణాలు చేపడుతున్న విషయం పై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే హైడ్రా అధికారులు సైన్ బోర్డు కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవుతున్న చెరువు స్థలాన్ని పరిరక్షించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు..

రౌడీ ముదిరితే రాజకీయనాయకుడవుతాడని పెద్దలు చెబుతూ ఉంటారు.. ఆ రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాకోరులు చెలరేగిపోతుంటారు.. రౌడీలనుంచి రాజకీయాల్లోకి వచ్చినవారికి ప్రజల కోసం పనిచేయాలనే ఇంగిత జ్ఞానం ఎక్కడనుంచి వస్తుంది.. వీళ్లకు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుస్తుంది.. అలాంటి నాయకులు కబ్జాదారులకు ఖచ్చితంగా అండగా ఉంటారు.. ఇక అవినీతి కూపంలో చిక్కుకున్న కొంతమంది ప్రభుత్వ అధికారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. ఇటు రాజకీయ నాయకుల అండ, అటు ప్రభుత్వ అధికారుల సహకారం.. ఇంకేముంది.. కృష్ణంరాజు లాంటి కబ్జా రాక్షసులు చెరువులను చెరబడతారు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. పెద్దచెరువులో బోర్లు వేసి నీళ్ళదందాతో బాటు, మట్టితో పూడ్చివేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడు.. ఇంత జరుగుతున్నా ఇతగాడిపై కేసులు నమోదు చెయ్యకపోవడం దురదృష్టకరం.. అసలు చెరువుల పరిరక్షణే ద్యేయంగా పనిచేస్తున్న హైడ్రా ఏమి చేస్తోందో అర్ధం కానీ పరిస్థితి.. అక్కడ కనీసం చెరువు భూమి అని సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంలో మతలబు ఏమిటి..? మున్సిపల్ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చివేసినా.. రౌడీలను పెట్టుకుని మరీ నిర్మాణాలు సాగిస్తున్న కృష్ణంరాజుకు అంత ఖలేజా ఎక్కడినుంచి వచ్చిందో..? తెలియాల్సి ఉంది..

రౌడీలను పెట్టీ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు.. అన్యాక్రాంతం అవుతున్న చెరువు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలాంటి ఆదేశాలు చేసింది.. అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. కబ్జాదారుడు కృష్ణం రాజుపై కేసు నమోదు చేయకపోవడం లో దాగి ఉన్న మర్మమేంటి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి చర్యలు చేపడతాడో అన్న విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది
