సూర్యపేట జిల్లా, పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబానికి సంస్థ నష్టపరిహారం అందించాలని యూపీ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ సెక్యూరిటీ కార్యాలయం అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. సమస్య ఉద్రిక్తతను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఎస్సై ఆర్ కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ కు చెందిన వినోద్ 45 డెక్కన్ పరిశ్రమలో కాంట్రాక్టర్ వర్కర్ గా పనిచేసేవాడని, ఆదివారం తాను నివసిస్తున్న ప్రదేశంలో గుండెపోటు రావడం గుర్తించిన వ్యక్తులు అతనిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినోద్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


తోటి కార్మికుడు మృతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్య ఉద్రిక్తతను ఆపాలని కోరారు. ఎస్సై సమస్య తీవ్రత తగ్గించే ప్రయత్నం చేయగా కార్మికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. పరిశ్రమ సెక్యూరిటీ రూమ్ ఫర్నిచర్, పోలీసు వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఎస్సై కోటేష్ కు, హోంగార్డ్ గోపికి స్వల్ప గాయాలయ్యాయి. దాడికి ప్రయత్నించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.