Friday, February 27, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంKommuri | కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుంచి నా భూమిని కాపాడండి

Kommuri | కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుంచి నా భూమిని కాపాడండి

నన్ను కూడా కాపాడండి అంటున్న వృద్ధ మాజీ రైల్వే ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్
ఘట్‌కేసర్‌లో అక్రమంగా తన 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన
కాంగ్రెస్ పార్టీకి చెందిన జనగామ మాజీ ఎమ్మెల్యే దుర్మార్గం
2010లో సర్వే నెంబర్ 68/1లోని 20 గుంటల భూమి కొనుగోలు చేసిన బాధితుడు
తన భూమిని దురాక్రమణ చేసి పార్క్ స్థలంగా చూపించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సాయిప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ
హైడ్రాను తప్పుదోవ పట్టించిన సాయిప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంత దారుణం చేశారని బాధితుడి ఆవేదన
తన ప్రాణాలను కాపాడి, తన స్థలం తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతం

ఆయనొక ప్రముఖ రాజకీయ నాయకుడు(Famous Political Leader). ప్రస్తుత తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) సభ్యుడు. కోట్లకు వారసుడు. పలుకుబడి కలిగిన వ్యక్తి. ఇంకొకరు ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో దేశానికి సేవ చేసిన వయో వృద్ధుడైన సామాన్య వ్యక్తి(Retired Railway Employee). తాను సర్వీస్ చేస్తూ అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బుతో 20 గుంటల భూమిని కొంటే ఆ భూమిమై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం(Real Estate Business) నడిపిస్తున్న రాజకీయ రాబందులు అన్యాయంగా ఆ భూమిని ఆక్రమించుకున్నారు. పార్క్ పేరుతో అబద్దాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు. తన భూమి చుట్టూ కట్టుకున్న ప్రహారీ గోడను కూల్పించేశారు.

- Advertisement -

ఇదెక్కడి న్యాయం. ఇదెక్కడి దౌర్జన్యం. ఒక సామాన్యుడు గుంట భూమి కొనే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో లేదా? కష్టపడి కొంటే ఆ భూమిని దుర్మార్గులకు అర్పించవలసిందేనా? చట్టాలు, న్యాయాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజా సేవ చేసిన ఒక సామాన్యుడికి న్యాయం జరగని ఈ పరిపాలన అవసరమా? అసలు మనం సమ సమాజంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దారుణ కథనంలో ఒకరు రిటైర్డ్ ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ అయితే మరొకరు విలన్‌గా మారి అతణ్ని హింసిస్తున్న సోకాల్డ్ పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి(Pratap Reddy).

హైదరాబాద్, జనవరి 08 (ఆదాబ్ హైదరాబాద్): దౌర్జన్యమే ఇప్పుడు రాజ్యమేలుతోంది. రాజకీయ పలుకుబడి, వెనకున్న కోట్లాది ఆస్తిపాస్తులు, డబ్బు ఈ సమాజాన్ని నడిపిస్తున్నాయి. అమాయకులు, సామాన్యులు ఈ లోకంలో బ్రతికే ఛాన్స్‌ను కోల్పోతున్నారు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న వ్యవహారం చూస్తుంటే ఈ మాటలు చెప్పక తప్పదు. నందకుమార్ గైక్వాడ్.. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. తాను సర్వీస్‌లో కష్టపడి సంపాదించిన డబ్బుతో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘటకేసర్ మండలం, గ్రామంలోని సర్వే నంబర్ 68/1 గల భూమిలో 2010వ సంవత్సరంలో 20 గుంటల భూమి అంటే అర ఎకరం భూమిని భూయజమాని శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. కాగా ఈ భూమి పక్కనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎ.నరసింహా రెడ్డి అనే మేనేజింగ్ పార్ట్‌నర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి ప్రగతి అసోషియేట్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ భూమి కొనుగోలు చేసి అందులో ఒక వెంచర్ వేశారు.

సర్వే నంబర్లు 21/P, 22, 23, 24, 25, 26, 27, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43/P, 57/P, 58, 60, 61/P, 62, 63/P, 64, 65, 66, 67/P, 68/Pలో గల 1,15,639,55 చ.మీ. విస్తీర్ణంలో తుది నివాస లేఔట్ కోసం వారు హెచ్ఎండీఏకి దరఖాస్తు చేసుకోగా.. హెచ్ఎండీఏ ఆమోదిస్తూ 2023 మార్చి 29న ఘటకేసర్ మునిసిపాలిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే సంబంధిత అధికారులకు ఫైల్ నంబర్ 059700/ఎల్‌టీ/జెడ్.ఓ.బీ./ఎఫ్.ఎల్.టి/యూ6/హెచ్.ఎం.డీ.ఏ/21022023, తేదీ: 29 మార్చి 2023 ద్వారా అప్రూవల్ లెటర్ పంపడం జరిగింది.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ సర్వే నంబర్ 68/1లో నందకుమార్ గైక్వాడ్‌కు సంబంధించిన 20 గుంటలు దాదాపు అర ఎకరం భూమిపై సదరు సాయి ప్రగతి అసోషియేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం కన్ను పడింది. వెంటనే ఆ భూమిని దురాక్రమణ చేశారు. తమ వెంచర్‌లో కలిపేసుకొని ఆ స్థలాన్ని పార్క్ స్థలంగా చూపిస్తూ సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన బాధితుడు అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు జరిగిన దురాక్రమణకు సంబంధించిన విషయాన్ని ప్రజావాణి కార్యక్రమంలో పలుసార్లు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సర్వే చేయించారు.

కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసిన అధికారులు పార్కు ఏర్పాటు చేసిన స్థలం సదరు బాధితుడికి సంబంధించినదే అని తేల్చడంతో ఆయన తన 20 గుంటల భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించుకున్నాడు. అంతే కాకుండా ఈ స్థలం తనకు సంబంధించినదే అని సర్వే నంబర్‌తో సహా చూపుతూ ఎవరైనా భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తే తెలంగాణ హైకోర్టు పరిధిలో శిక్షకు అర్హులు అని ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కానీ.. దురాక్రమణదారులైన సాయి ప్రగతి అసోషియేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆ స్థలం తమ వెంచర్‌లోని పార్క్ స్థలం అంటూ సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అక్కడి ప్రహారీ గోడను తొలగించాలని హైడ్రాకు అక్రమంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు అసలు జరిగిన వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలు క్షణ్ణంగా పరిశీలించకుండానే, బాధితుడికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే హడావుడిగా గోడను కూల్చివేశారు. తనకు జరిగిన అన్యాయానికి బాధితుడు ఆందోళన చెంది అనారోగ్యానికి గురయ్యాడు. తనకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో ప్రాణహాని ఉందని, తనను రక్షించి, తన కష్టార్జితమైన భూమిని తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతుండటం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. కాగా.. 8 డిసెంబర్ 2010 నాడు భూయజమాని డి.శివారెడ్డి.. తండ్రి జాంగారెడ్డితో బాధితుడు నందకుమార్ గైక్వాడ్ చేసుకున్న సేల్ డీడ్ నంబర్ 1937/2010 ప్రకారం సదరు సర్వే నంబర్ 68/1లో గల 20 గుంటల భూమి నందకుమార్‌కి చెంది ఉన్నదని, ఈ సేల్ డీడ్ ప్రకారం సదరు బాధితుడు తాను కొన్న 20 గుంటల ఆ భూమిపై సర్వ హక్కులు కలిగి ఉన్నాడని తేటతెల్లం చేస్తోంది.

అలాగే ఆ భూమికి నంబర్ 25052తో పాస్ బుక్, పట్టా నంబర్ 664గా అప్పటి ఘట్‌కేసర్ ఎమ్మార్వో జారీ చేసినట్లు కూడా పత్రాలు ఉన్నాయి. మరి ఇంత బలమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ.. సదరు భూమి పార్క్ స్థలంగా ఎలా మారింది? అది పార్క్ స్థలమని సాయి ప్రగతి అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు ఏవిధంగా ప్రభుత్వ అధికారులను నమ్మించగలిగారు? అది పరిశీలించకుండానే హైడ్రా అధికారులు ముందస్తు నోటీసు లేకుండా బాధితుడు నిర్మించుకున్న ప్రహారీ గోడను ఏవిధంగా కూల్చివేశారు.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఆ స్థలాన్ని తమకు విక్రయించమని పలుమార్లు ఆక్రమణదారులు తనను బలవంతం చేశారని కానీ తాను దానికి ఒప్పుకోలేదని, అందుకే తనపై కక్షగట్టి హెచ్ఎండీఏ తదితర ప్రభుత్వాధి కారులను తప్పుదోవ పట్టించి దుర్మార్గంగా తన స్థలాన్ని కాజేసి, ప్రహారీ గోడను కూలగొట్టించారని బాధితుడు వెల్లడించాడు.

అసలు అన్ని విషయాలు క్షణ్ణంగా పరిశీలించకుండా హెచ్ఎండీఏ ఏవిధంగా వెంచర్‌కు పర్మిషన్ ఇచ్చింది. అలాగే కంప్లైట్ అందగానే నిజానిజాలు తెలుసుకోకుండా హైడ్రా ప్రహారీ గోడను ఎలా కూల్చివేస్తుంది. వెంచర్‌కు పర్మిషన్ ఇచ్చిన హెచ్.ఎం.డీ.ఏ. హడావుడిగా కూలగొట్టిన హైడ్రా సదరు వెంచర్ యజమానులతో కుమ్మక్కయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. ఆ వెంచర్‌కు ఇచ్చిన పర్మిషన్‌ను క్యాన్సిల్ చేసి, పర్మిషన్ ఇచ్చిన హెచ్.ఎం.డీ.ఏ. అధికారులపై, అన్యాయంగా ప్రహారీ గోడను కూలగొట్టిన హైడ్రాపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేసి తన భూమిని తనకు ఇప్పించి తనను కాపాడాలని బాధితుడు కోరుతున్నాడు. మరి ఈ వ్యవహారాన్ని సంబంధిత ప్రభుత్వాధికారులు ఏవిధంగా చూస్తారు? బాధితుడికి న్యాయం జరుగుతుందా? పలుకుబడి కలిగిన బడా బాబులకే తలొంచుతారా? అన్నది వేచి చూడాలి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News