Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణAi | ఆర్టీసీలో ఎఐ వినియోగం

Ai | ఆర్టీసీలో ఎఐ వినియోగం

  • మరింత వేగంగా సేవలకు నిర్ణయం
  • ఎఐ వినియోగం కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు
  • ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందన

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగు పరుచుకునేందుకు ఆర్‌టిసి(TGSRTC) మరో గొప్ప అడుగు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial intelligence)ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా ఎఐ(Ai) వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా తెలంగాణ ఆర్‌టిసి నిలిచింది. ఎఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌పి అనే సంస్థ ఆర్‌టిసికి తోడ్పాటు అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది. సంస్థలో ఎఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీంను యాజమాన్యం ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారులను గుర్తించి ఆ టీంలో ప్రాధాన్యం ఇచ్చింది. ఎఐ వాడకంపై ఆ టీమ్‌కు హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్‌ శిక్షణ ఇస్తోంది. ఎఐ ప్రాజెక్టులో భాగంగా మొదట 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు.

గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌ లో భాగంగా ఉద్యోగులకు చేసిన వైద్య పరీక్షల ఆధారంగా ఆరోగ్య పరిస్థితిని ఎఐ, మెషిన్‌ లెర్నింగ్‌ సహకారంతో అంచనా వేస్తున్నారు. మొదట పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు డిపోల్లో అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. త్వరలోనే ఎఐ ద్వారా ఆటోమెటిక్‌ షెడ్యూలింగ్‌ను సంస్థ చేస్తోంది. రోజు, తిథి, పండుగులు, వారాల్లో ఎఐ మెషిన్‌ లెర్నింగ్‌ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఆ మేరకు బస్సులను సంస్థ ఏర్పాటు- చేయనుంది. ఆర్‌టిసిలో ఎఐ ప్రాజెక్ట్‌ అమలు తీరు గురించి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఇటీ-వల రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ఆర్‌టిసి ఎండి, విసి సజ్జనార్‌, ఆర్‌టిసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాట్రజిక్‌ డిప్లాయ్మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌డిపి) కీలక పాత్ర పోషిస్తున్నదని ఆర్‌టిసి ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నెలా ఎస్‌డిపి సవిూక్షా సమావేశాలను నిర్వహిస్తూ, స్వల్పకాలిక దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌ను నిర్దేశిరచుకుని, వాటి అమలులో సంస్థ చురు-కై-న చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. తమ పనితీరు మెరుగుపరచుకోడానికి ఎఐని వినియోగించుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌టిసి ఉన్నతాధికారుల కృషిని అభినందించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎఐ ప్రభావితం చేయని రంగమే లేదని, రవాణా వ్యవస్థలో మార్పులను గుర్తించి ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఎఐని వినియోగించుకోవాలని భావించడం గొప్ప విషయమని ఆయన అన్నారు.

ఈ ఎఐ ప్రాజెక్ట్‌ అమలుకు సమష్టిగా పనిచేసి ఆర్‌టిసి మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తూ 2021 నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఎస్‌డిపి అమలు, ఎఐ ప్రాజెక్ట్‌ రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌పికి చెందిన త్రినాధబాబు, సునీల్‌ రేగుళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసేందుకే ఎఐ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ తెలిపారు. ఎఐ వినియోగం వల్ల సేవల్లో మరింత వేగం, కచ్చితత్వం, స్పష్టత ఉంటుంద‌ని ఆయన వివరించారు. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్‌ పరిస్థితులను బట్టి స్మార్ట్‌ షెడ్యూలింగ్‌ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజా రవాణా రంగంలో సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలి మోడల్‌గా టిజిఎస్‌ ఆర్‌టిసి నిలవడం గర్వకారణమని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ ఈడీలు మునిశేఖర్‌, ఖుష్రోషా ఖాన్‌, వెంకన్న, రాజశేఖర్‌, సిటిఎం శ్రీదేవి, సిపిఎం ఉషాదేవి, సిఈఐటి శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News