మానవుడికి, సమస్త జీవరాశికి ఆహారం (Food) తర్వాత కావలసిన దివ్యౌషధం (Miracle Medicine) నీరు. ఈ రోజుల్లో పరిశుభ్రమైన నీరు (Clean Water) అందుబాటులో లేక కోట్లాది మంది రకరకాల జబ్బుల (Diseases) బారినపడుతున్నారు. అందువల్ల జలమే జీవనం.. జీవితంగా మారిపోయింది. మంచి తాగునీరు మన శరీరాన్ని రోగాలకు లొంగకుండా సంరక్షించే గొప్ప సంజీవని (Sanjeevani) అని చెప్పొచ్చు. శుభ్రమైన తాగునీరు మన ఆరోగ్య పరిరక్షణకు ఉచితంగా లభించే ఔషధం. వేకువజామున రెండు మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగితే చాలు. మనలో అంతవరకు ఆవహించి ఉన్న నిస్సత్తువ తొలిగిపోయి రోజంతా మన శరీరం ఎనలేని ఉత్సాహాన్ని (Activeness) పొందుతుంది.
ముఖ్యంగా మండు వేసవిలో సముపాళ్లలో స్వచ్ఛమైన నీరు తాగితే మన శరీరం డీహైడ్రేషన్ (Dehydration)కి గురికాదు. అత్యంత సురక్షితంగా ఉంటుంది. అందుకే ప్రజలందరూ స్వచ్ఛమైన నీరు తాగి మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలనే ఏకైక లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఉచిత బోర్లు వేస్తూ ప్రజలందరికీ నీరు అందుబాటులో ఉండేలా కృషి చేస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఇంటికీ నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు. ఏదిఏమైనా స్వచ్ఛమైన నీటి వాడకం మన ఆయుష్షును పెంచడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకుండా సదా ఆరోగ్యవంతులుగా జీవించేందుకు మనకు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది.
స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. నేడు ప్రతి గ్రామంలోనూ గుర్తింపులేని వాటర్ ప్లాంట్లు విచ్చలవిడిగా వెలిశాయి. అధిక మోతాదులో వివిధ కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారు. ఐ.ఎస్.ఇ గుర్తింపు లేదు. ఆటోలు ఏర్పాటుచేసి వాటి ద్వారా ప్రతి ఇంటికీ నామమాత్రపు రుసుంతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగటం వల్ల వివిధ నొప్పులు, కాళ్లు లాగడం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నిఘా తగ్గి విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. అనుమతులు లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేయాలి.
- కామిడి సతీష్ రెడ్డి
