పాఠకులకు సుపరిచితులు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్. జీవితాంతం నిజాయితీ బాటలో నడిచారు. నిబద్ధతకు మారుపేరుగా నిలిచారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం సుధాకర్‌కే సొంతం. ఆచార్య ఎండ్లూరి సుధాకర్.. 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాముల బస్తీలో అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు(Jury Member of The Kendra Sahitya Akademi), తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు(Telugu Academy Member), ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్(Senior Professor, Telugu Department, University of Hyderabad)గా పనిచేశారు.
సుధాకర్ తల్లిదండ్రులు దేవయ్య, శాంతాబాయి. వారికి ఆయన ప్రథమ సంతానం. హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్‌లోనే సాగింది. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎం.ఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి విశ్వవిద్యాలయ ఆచార్య స్థాయికి చేరుకున్నారు. 1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్‌లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా ఉద్యోగం చేశారు.
1990 అక్టోబరు 6 నుంచి వివిధ పదవులను నిర్వ హించారు. 2004 నుంచి 2011 వరకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ ‘వాజ్మయి’ సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా వ్యవహరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆధునిక శాఖాధిపతిగా (1994 నుంచి 2012 వరకు) పదవులను నిర్వహించారు. 2009 సెప్టెంబర్ 5 నుంచి రాజమండ్రి సాహి త్యపీఠానికి ఆచార్యుడిగా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
2002 జులైలో అమెరికా తెలుగు అసోసియేషన్‌లో జరిగిన పలు సాహిత్య సభల్లో ప్రసంగించారు. 2011 డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో మారిషస్‌లో ప్రపంచ తెలుగు సదస్సులో పాల్గొన్నారు. 2017 మేలో అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో సిలికాన్ ఆంధ్రా ద్వారా మన బడి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు.
తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్ర వేసుకున్న ఎండ్లూరి.. వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల తదితర రచనలు చేశారు. తెలుగు సాహితీ క్షేత్రంలో తమదైన స్థానాన్ని పదిలపరచుకున్నారు. నేటికీ ఆయనను అనుకరిస్తూ అనుసరిస్తూ ఆయన బాటలో పయనిస్తున్నవారు ఎందరో కవులు ఉన్నారంటే ఆయన ప్రభావం ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. సాటి కవుల పట్ల సహృదయతే తప్ప అసూయ ఎరగని వ్యక్తిత్వం, ఎంత ఎత్తుకు ఎదిగినా అతి సామాన్య జీవితం గడపడం లాంటి ప్రత్యేకతలు ఆయనకే చెందుతాయని ఆయనతో పరిచయమున్నవారు చెబుతారు.
గుర్రం జాషువా అనంతరం అంతటి విశాల హృదయం, భావుకత లాంటి బహుముఖీన ప్రజ్ఞ సుధాకర్‌లోనే కనబడుతుంది అంటే అతిశయోక్తి కాదు. దళిత సాహితీ రథసారథి ఎండ్లూరి సహ ధర్మచారిణి దివంగత హేమలత.. రచయిత్రి, సామాజిక సేవకురాలు కాగా వారి కూతురు ఎండ్లూరి మానస కథా రచయిత్రి. ఆమె రాసిన కథా సంపుటి ‘మిళింద’కు 2020లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించడం విశేషం.
లలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ, స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి, యలమంచిలి, ఫ్రీవర్స్ ఫ్రంట్, ఉదయ భారతి జాతీయ అవార్డు, భువనేశ్వర్, కవికోకిల జాషువా, తిలక్ అవార్డు, బెంగళూరు, గరికపాటి సాహిత్య పురస్కారం కాకినాడ, సమతా రచయితల పురస్కారం అమలాపురం, రాజమండ్రి ప్రతిభా పురస్కార్, రాజమండ్రి, జాసిస్ అవార్డు, రాజమండ్రి, మ్యాన్ ఆఫ్ ది ఇయర్, రాజమండ్రి, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, బి.ఎస్. రాములు కథా పురస్కారం, ఎన్.జి.రంగాసెంటరీ అవార్డు, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ అవార్డు అందుకున్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా, డల్లాస్, సినారె పురస్కారం-కరీంనగర్, నేదురుమల్లి జనార్ధన రెడ్డి ట్రస్ట్ ప్రకాశం, నెల్లూరు, సహృదయ సాహితీ పురస్కారం, వరంగల్, కొండెపూడి శ్రీనివాసరావు కవితా పురస్కారం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు స్మారక పురస్కారం, అద్దంకి, తపన ఫౌండేషన్ అవార్డు రాజమండ్రి, ప్రతిభావంతులైన విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డు, కవి జాషువా సాహిత్య ఆం.ప్ర. ప్రభుత్వ అవార్డు పొందారు.
రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, పిఠాపురం, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం, యువకళావాహిని ద్వారా డాక్టర్ జీఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు, అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా కవి అరుణ్ సాగర్ మెమోరియల్ అవార్డుతోపాటు మరిన్ని పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2022 జనవరి 28న (శుక్రవారం) తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 63వ పుట్టిన రోజు తర్వాత వారం రోజులకే ఈ లోకాన్ని వదిలివెళతారని ఎవరూహిస్తారు. సుధాకర్ అకాల మరణం ఆధునిక తెలుగు సాహిత్యానికి తీరని లోటు.
(జనవరి 21న ఎండ్లూరి జయంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
