నిరంతర అభ్యాసమే విజయానికి మార్గం
శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ
కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Governor), శాతవాహన యూనివర్సిటీ ఛాన్స్‌లర్ (Chancellor of Satavahana University) జిష్ణుదేవ్‌వర్మ (Jishnu Dev Varma) తెలిపారు. శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. శాతవాహన వర్సిటీ రెండో స్నాతకోత్సవానికి (Convocation) ఆయన హాజరై ప్రసంగించారు. 25 మందికి పీహెచ్డీ (Phd) పట్టాలతోపాటు 2018 నుంచి 2023 వరకు వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలను (Gold Medals) అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్‌వర్మ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళుతుందని అన్నారు. విద్యార్థుల మేధాశక్తే వారి ప్రయోగశాల అని అభివర్ణించారు.
విద్యార్థుల ఆలోచనలు, శ్రమ, సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. అవకాశం, సమానత్వం సృజనాత్మకతతో ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయానికి విద్యా రంగాల్లో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పాలని తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. విద్యా రంగం.. బ్లాక్ బోర్డు, చాక్‌పీస్‌లకే పరిమితం కావద్దొని సూచించారు. ప్రస్తుతం విద్యా రంగం సాంకేతికతతో ముందుకు సాగుతుందని అన్నారు. డిజిటల్ లెర్నింగ్ భౌగోళిక అవరోధాలను, అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరిపేసిందని తెలిపారు.
ప్రతి విద్యార్థికీ నైపుణ్యం, నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచుకోవాలని వివరించారు. తెలంగాణ మట్టి పరిమళాన్ని మరవొద్దని పిలుపునిచ్చారు. అందరూ సమానంగా జీవించే సమాజమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. ప్రతిభ ఎక్కడైనా వికసిస్తుందని, భయాన్ని, అలసటను అధిగమించి ముందుకు సాగాలని ఉద్భోదించారు. కృషితో ప్రతి విద్యార్థి అభివృద్ధీ సాధ్యమేనని అన్నారు. విద్యార్థి దశ నుంచే సేవా మార్గాన్నిఅనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ జె.బి.రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ యు.ఉమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
