కారా మాస్టారు(Kara Master)గా ప్రాచుర్యం పొందిన కాళీపట్నం రామారావు తెలుగు కథా సాహిత్యానికి (Telugu fiction) మార్గదర్శకులు(Guide). సామాన్యుడి నుంచి సాహితీ శ్రేణుల వరకు అందరి హృదయాల్లో ఆయన రచనలు చిరస్థాయిగా నిలిచాయి. సామాజిక ఆవేదన, పేదరికం, ప్రజల కష్టాలు, సంతోషాలు, వివక్ష వంటి అంశాలను ఆయన తన కథల ద్వారా అద్భుతంగా ప్రతిబింబించారు. తెలుగు కథల్లో ఒక నూతన దిశను సృష్టించారు.
బాల్యం, విద్యాభ్యాసం
కాళీపట్నం రామారావు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యం పల్లెటూరిలో గడచింది. ఈ పల్లెటూరి జీవితం ఆయన రచనలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. బాల్యంలోనే సామాజిక అసమానతలపై ఆయనకు అవగాహన కలిగింది. గ్రామీణ ప్రజల జీవితాలను దగ్గరగా చూశారు. వారు ఎదుర్కొనే సమస్యలను అర్థంచేసుకున్నారు. ఈ పరిచయం ఆయన రచనలకు మేలుకొలుపుగా మారింది.
ఉపాధ్యాయ వృత్తి
రామారావు తన కెరీర్‌ను ఉపాధ్యాయుడి(Teacher)గా ప్రారంభించారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినప్పటికీ రచనా వ్యామోహం ఆయనను విడిచిపోలేదు. ఉపాధ్యాయుడిగా మారిన ఆయన.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలు నేర్పడమే కాకుండా జీవితంలోని విలువలు, సమాజంలోని అవకతవకలను కూడా పరిచయం చేశారు. ఉపాధ్యాయ వృత్తి ఆయనకు రచనా వ్యాసంగానికి ప్రేరణగా మారింది.
రచనా ప్రస్థానం
రామారావు రచనా ప్రస్థానం సామాజిక బాధ్యత, మానవతా స్పృహ, సామాజిక అసమానతలను ప్రతిబింబించేలా సాగింది. ఆయన కథల్లో భాష, శైలి, విషయ పరిధి అన్ని విభిన్నంగా ఉండేవి. కాళీపట్నం రామారావు కథా రచయితగా ప్రవేశించిన మొదట్లోనే ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. ఆయన కథలు తెలుగు పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి. రామారావు రచించిన ప్రతి కథలో ఒక సామాజిక సందేశం దాగి ఉండేది. ఆయన రచనలు సామాన్య ప్రజల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపేవి.
కథా నిలయం: తెలుగు కథలకు ఆశ్రయం
తెలుగు కథలను భద్రపరచడం, ప్రచారం చేయడం, కొత్త కథకులను ప్రోత్సహించడం అనే లక్ష్యంతో రామారావు కథానిలయం (kathaNilayam) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కొత్త రచయితలు తమ సృజనాత్మకతను ఈ వేదిక ద్వారా ప్రదర్శించగలిగారు.
కథానిలయం తెలుగు కథా ప్రాధాన్యతను అర్ధంచేసుకునే ప్రతి పాఠకుడికి అంజలి. 1997లో ఆరంభమైన ఈ “కథా నిలయం”లో (200 0నాటికి) 4 వేలకు పైగా వార పత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుంచి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు.
కథా శైలీ లక్షణాలు
కాళీపట్నం రామారావు కథల్లో సామాజిక బాధ్యత, సమాజంలోని వివక్షలను ప్రతిబింబించే ఓ తాత్త్విక భావన కనిపిస్తుంది. ఆయన కథల భాష సులభమైంది. పాఠకుడికి ఆలోచన కలిగించేలా ఉంటుంది. సాధారణ కథలుగా కనిపించినప్పటికీ వాటి లోతులో మానవీయ సత్యాలు, సున్నిత భావోద్వేగాలు ఉన్నాయి. ప్రతి కథకు ఒక అర్థవంతమైన ముగింపు ఉండేలా చూసేవారు.
విశేష సాహితీ పురస్కారాలు
రామారావు రచయితగా ఎన్నో ప్రశంసలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు పలు సాహిత్య సన్మానాలు అందుకున్నారు. ఈ అవార్డులు ఆయన రచనా కృషికి గుర్తింపుగా నిలిచాయి. రామారావు రచనల్లో ప్రతిబింబించే సామాజిక చైతన్యమే ఆయనకు అనేక పురస్కారాలను అందించింది.
కాళీపట్నం రామారావు ఒక సామాన్యుడికి కూడా సాహిత్య సామర్ధ్యాన్ని అర్థంచేసుకునేలా చేసిన మహనీయుడు. ఆయన కథలు సామాన్య పాఠకుడికి సమాజంలోని సమస్యలను అర్థంచేసుకునేలా చేస్తాయి. రామారావు స్థాపించిన కథానిలయం తెలుగు కథలకు ఒక చిరునామాగా నిలిచి కొత్త తరాలకు మార్గదర్శకత్వం చేస్తోంది.
(నవంబర్ 9న ‘కారా’ జయంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
