- గుజరాత్ జునాగడ్‌లోని గిరినార్ సిద్ధ క్షేత్రంలో నిర్వహణ
- అశేష భక్త వాహినితో విశేష పూజలందుకున్న దత్త గురు
- నిరంతర అన్నదానాలతో భక్తులకు సేవలందిస్తున్న అక్షయ నివాసం
- సముద్ర మట్టం నుంచి దాదాపు 4 వేల అడుగుల ఎత్తున కొలువైన దత్తాత్రేయుడి స్వయంభూ పాద చరణాల దివ్య మందిరం
- దత్తుడి స్వహస్తాల నుంచి వెలువడిన అన్నదాన క్షేత్రం, కమండల కుండం, అగ్నిగుండం ధుని
- ఈ స్వామి వారిని దర్శించుకున్నవారికి జీవితంలో తిరుగుండదని దత్త భక్తుల వాగ్దానం
ఏ క్షేత్రమైతే నాలుగు యుగాలుగా ప్రసిద్ధి చెందుతూ వస్తోందో దాన్నే సిద్ధ క్షేత్రం అంటారు. అలాంటిదే గుజరాత్(Gujarat)లోని గిరినార్ మహా పర్వతం(Girinar Great Mountain). సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను తన ఒడిలో నింపుకున్న గిరినార్ పర్వతం మార్గశిర పౌర్ణమి (Margashir Pournami) దత్తాత్రేయ స్వామి (Dattatreya Swami) జయంతి రోజు మరోసారి దత్తాత్మ శక్తితో ప్రకాశించింది.
దత్త జయంతి విశేషాలు
మార్గశిర పౌర్ణమి రోజు పున్నమి వెన్నెల కాంతులతో గిర్నార్ ప్రాంతం మొత్తం దత్త నామస్మరణతో పులకించిపోయింది. ఉదయం వేళ గిర్నార్ పవిత్ర మార్గంలోని శ్రీ దత్త పాద చరణ మందిరంలో రాజోపచార, మహాపూజ, మహాభిషేకంతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దత్త సాంప్రదాయంలోని ప్రాచీన పద్ధతులను అనుసరించి “బ్రహ్మ, విష్ణు, మహేశ్వర” త్రిమూర్త్యాత్మకమైన దత్తతత్వంకు విశేష ఆహ్వానం పలికే ఈ పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

అనంతరం.. అత్యంత భక్తి భావంతో దత్త దుని-కమండల కుండం వద్ద దత్తాత్రేయ మహాయజ్ఞం జరిగింది. ఈ సంవత్సరం దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు కేవలం ఆధ్యాత్మిక పండుగగా మాత్రమే కాకుండా భారతీయ సనాతన సంస్కృతికి అద్దం పట్టే విశిష్ట ఆధ్యాత్మిక మహోత్సవంలా నిలిచాయనటంలో ఎలాంటి సందేహం లేదంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
దేశవిదేశాల నుంచి భక్తుల రాక
మహంత్ శ్రీ మహేష్ గిరి బాపు, గురు శ్రీ అమృత గిరి బాపు క్షేత్రాన్ని అన్నివేళలా అన్ని దశాదిశల్లో చూసుకుంటూ ముందుకు సాగుతున్న మహంత్ మహేష్ గిరిబాపు, అమృత గిరిబాపు ఈ ఒక్క జయంతి ఉత్సవాలు సంతోషంగా, ఆధ్యాత్మికంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగినందుకు సంతోషం వెలిబుచ్చారు.

దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులందరికీ గురు కృప కలగాలని ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. భజనలు, నామస్మరణలు, సామూహిక ప్రార్ధనలతో పర్వతమంతా ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోవడం చూస్తే ఈ గిరినార్ పర్వతమే ఒక భూలోక స్వర్గమనే భావన కలిగిందని హర్షం ప్రకటించారు.
క్షేత్ర మహిమ
ఈ ప్రాంతంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి.. యోగా, తపస్సు, ధ్యానం, సన్యాస ధర్మాలను పాటించారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల దీన్ని పవిత్ర స్థానంగా పేర్కొంటారు. అంతేకాకుండా దత్తుడి అనుగ్రహానికి పాత్రులైన ఎందరో, మరెందరో యోగులు, సిద్ధులు, మహా మహా ఋషులు, అవధూతలు, నాగ సాధువులు, దత్త ఉపాసకులు ఇక్కడ తమ సూక్ష్మ, స్థూల శరీరాలతో తిరుగుతూ ఉంటారనడంలో అనుమానంలేదు.

నేటికీ అక్కడ నమ్మశక్యంకాని ఎన్నో దివ్య మహాద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి పాద చరణ మందిరం 10 వేల మెట్ల పైన ఉంటుంది. గురు చరిత్ర, పురాణాల ప్రకారం ఈ దత్తాత్రేయ పీఠం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలోనే అత్యంత ప్రభావశీల ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న తపశక్తి, చైతన్యం ద్వారా ఆధ్యాత్మికంగా లాభపడటానికి ఎంతో మంది సాధకులు వస్తుంటారు.
అక్షయ నివాసం
ఇక్కడ కొండపైన నిరంతరం అన్నదానం జరుగుతుంది. ఈ మహా కార్యక్రమం సాక్షాత్తూ దత్తుడే ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. దత్త సాంప్రదాయంలో “దత్త బిక్ష” అనేది అత్యంత పూజ్యనీయమైంది. మహిమాన్వితమైంది. పవిత్రమైంది. ఆ దైవ సంప్రదాయాన్ని కొనసాగించడానికి 365 రోజులు 24 గంటలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం “అక్షయ నివాసం”గా ప్రసిద్ధికెక్కింది.

అన్నదానం వెనక కఠోర శ్రమ
ఈ అక్షయ నివాసం స్వామివారి ఆలయానికి దగ్గరలో ఉంటుంది. సముద్ర మట్టం నుంచి దాదాపు 3,500 అడుగుల ఎత్తున ఉంటుంది. వంటకు కావలసిన గ్యాస్ సిలిండర్లు, పాత్రలు మొదలుకొని కూరగాయల వరకు అన్నీ పైకి చేర్చడానికి ఎలాంటి సౌలభ్యం లేకపోవడం వల్ల ఆలయ నిర్వహకులే ఆ వస్తు సామాగ్రిని తమ భుజాలపై మోసుకొని, చెమటోడ్చి, తీవ్రమైన కష్టాన్ని సంతోషంగా భరిస్తూ పైకి చేరుస్తారు.

ఉచిత అన్నప్రసాదాన్ని కడుపు నిండా స్వీకరించిన భక్తుల సంతోషాన్ని చూసి వారు తమ కష్టాలన్నీ మరచిపోతారు. ఈ విధంగా దత్త భక్తులకు సేవలు అందించడమే తమ ధ్యేయమని ఆలయ నిర్వహకులు భావిస్తుంటారు.
కమండల గుండం
ఒకానొక సమయంలో అక్కడ నీటి చుక్క కూడా లేదు. అప్పుడు.. దత్తాత్రేయ స్వామి తన కమండలాన్ని విసిరిన చోట ఒక నీటి గుండం ఏర్పడింది. ఆవిధంగా ఏర్పడిన గంగమ్మ ఇప్పుడు భక్తుల దాహార్తిని, నీటి అవసరాలను తీరుస్తోంది. వేల అడుగుల ఎత్తున ఉన్న ప్రాంతంలో నీటి వసతి ఉండటం అద్భుతమే కాకుండా శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అఖండ దుని
ఈ కొండ పైన నిరంతరం అగ్నిగుండం వెలుగుతుంది. ఈ దునిని సాక్షాత్తూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారే వెలిగించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ దివ్య జ్యోతి యుగయుగాలుగా వెలుగుతోందని తెలుసుకోవడం ఎంతో ఆధ్యాత్మిక పులకింతలను తెప్పించే విషయం. ఈ దుని కింద ప్రతి సోమవారం ఆలయ నిర్వహకులు 40 కేజీల రావి చెట్టు కొమ్మలను సమర్పిస్తారు.
తర్వాత.. ఆ అగ్నిని భస్మంతో కప్పేస్తారు. తదుపరి సోమవారం వరకు ఎవరి నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ జ్యోతి అలాగే స్వతహాగా భస్మం కింద వెలుగుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యం, మహాద్భుతం.
