Tuesday, March 3, 2026
Homeసాహిత్యంDog Bite|కుక్క కాటుకు అవగాహనే చెప్పు దెబ్బ

Dog Bite|కుక్క కాటుకు అవగాహనే చెప్పు దెబ్బ

పూర్తిగా నివారించదగిన రేబిస్‌ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం, తీసుకోవలసిన తగు జాగ్రత్తలను వివరించడం, కుక్క కాటు పట్ల అపోహలను రూపుమాపడానికి 2007 నుంచి ప్రతి ఏట సెప్టెంబర్‌ 28 రోజు “ప్రపంచ రేబిస్‌ దినం (వరల్డ్‌ రేబిస్‌ డే)” పాటించడం ఆనవాయితీగా మారింది. రేబిస్‌ టీకాలను రూపొందించిన ప్రముఖ కెమిస్ట్‌, మైక్రోబయాలజిస్ట్‌ “లూయిస్‌ పాశ్చర్‌” వర్థంతి సందర్భంగా ఈ వేదికను వాడుకోవడం జరుగుతోంది. ప్రపంచ రేబిస్‌ దినం -2025 ఇతివృత్తంగా “అవగాహన కల్పించడం, టీకాలు వేసుకోవడం, నివారించడం” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. జంతువులు, మానవులకు రేబిస్‌ సోకకుండా సురక్ష చటీకాలు అందుబాటులో ఉన్నందున రేబిస్‌ వ్యాధి కట్టడి సులభసాధ్యం అవుతున్నది. రేబిస్‌ వ్యాధి సోకినపుడు మెదడుతో పాటు కేంద్ర నాడీమండల వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. రేబిస్‌ (Rabies)వైరస్‌ సోకినపుడు వచ్చే రేబిస్‌ వ్యాధి పట్ల ప్రజల్లో అపోహలు, తప్పుడు సమాచారాలు, అవాస్తవ భ్రమలు, దురభిప్రాయాలు, అవగాహన లేమి కారణాలతో తమ ప్రాణాలను సహితం కోల్పోవడం చూస్తున్నాం. రేబిస్‌ వ్యాధికి కారణమైన జంతువులకు, ముఖ్యంగా కుక్కలకు రేబిస్‌ టీకాలు వేసిన యెడల ఈ వ్యాధి నిరోధించబడుతుంది. 

రేబిస్‌ వ్యాధి(Rabies) ప్రాణాంతకమైనది, పూర్తిగా నివారించదగినది :

- Advertisement -

       రేబిస్‌ వ్యాధి (Rabies)99 శాతం ప్రాణాంతమే అయినా 100 శాతం నివారించదగినదే. రేబిస్‌ వ్యాధి కట్టడికి కుక్కలకు టీకాలు వేయించడం, వీధి కుక్కల జనాభాను నియంత్రించడం, భయాన్ని వీడి వాస్తవాలను అర్థం చేసుకోవడం జరగాలి. ఐరాస లక్ష్యాల ప్రకారం 2030 నాటికి “రేబిస్‌ మరణాలు లేని” లేదా “జీరో రేబిస్‌ మరణాలు” ప్రపంచాన్ని నిర్మించాలని ప్రణాళికలను అమలు చేస్తున్నది. రేబిస్ వైరస్‌ వ్యాధి‌ కారణ మరణాల్లో 95 శాతం వరకు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే నమోదు అవుతున్నాయి. కుక్క కాటు వేసిన వెంటనే(15 నిమిషాల్లో) ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయడం, వెంటనే రేబిస్‌ టీకా పూర్తి డోసులను తీసుకోవడం తప్పక జరగాలి. అశ్రద్ధ చేసినపుడు ప్రాణాంతర స్థాయి వస్తుందని తెలుసుకోవాలి. 

రేబిస్‌ వ్యాధి ప్రపంచ కేంద్రంగా భారత్‌:

         రేబిస్‌ వ్యాధి (Rabies)దాదాపు 150 దేశాల్లో నమోదు అవుతున్నది. కేవలం భారత్‌లోనే 40 శాతం రేబిస్‌ కేసులు బయట పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాలీనా 59,000 మంది, భారత్‌లో 20,000 మంది రేబిస్‌ వ్యాధితో మరణిస్తున్నారు. రేబిస్‌ మరణాల్లో దాదాపు 40 శాతం ప్రజలు 15 ఏండ్ల లోపు వారే ఉండడం విచారకరం. కుక్క కాటు పట్ల అవగాహన లేని కారణంగా నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు పోతున్నాయి. కుక్క కాటుతోనే కాకుండా పిల్లలు, గబ్బిలాలు, ముంగీసలు కాచు వేయడం లేదా గీరడం వల్ల కూడా రేబిస్‌ వ్యాధి రావచ్చని గమనించాలి. రేబిస్‌ వ్యాధి లక్షణాల్లో జ్వరం, బలహీనత, వాంతులు, దురద, మింగడంలో ఇబ్బందులు, లాలాజలం అతిగా ఊరడం, కండరాల నొప్పులు, వణుకు, తల నొప్పి, ఉద్రేకం, గందరగోళం, మస్తిష్క లోపం, నీటిని చూస్తే భయం (హైడ్రోఫోబియా), కోమాలోకి వెళ్లడంతో మరణం లాంటివి కనిపిస్తాయి. 

రేబిస్‌ వ్యాధి (Rabies)నివారణ పట్ల సంపూర్ణ అవగాహన:

       వీధి కుక్కలు (Street Dogs) లేదా జంతువులను తాకకుండా ఉండడం, సాధు జంతువులకు టీకాలు వేయించడం, సాధు జంతువులు బయటకు వెళ్లినపుడు జాగ్రత్తగా పర్యవేక్షించడం, కాటు వేసిన లేదా గీరిన వెంటనే నీటితో శుభ్రం చేయడం, వెంటనే పూర్తి డోసుల టీకాలను తీసుకోవడం, విచిత్ర ప్రవర్తన కలిగిన కుక్కల సమాచారాన్ని అధికారులకు అందించడం విధిగా జరగడానికి ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలి. కుక్క కాటుతో మాత్రమే రేబిస్‌ వస్తుందనే అవాస్తవాలను నమ్మకపోవడం, చిన్న కాటు లేదా గీరినపుడు ఏమీ కాదని నిర్లక్ష్యం చేయడం, కాటు వేసిన కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడతాయని తెలుసుకోవడం, రేబిస్‌ వైరస్‌ కలిగిన కుక్కల నోటిలోంచి నురగ కారడం, ఒక్కసారి రేబిస్ టీకా జీవితకాలం పని చేయదని గమనించడం, సాంప్రదాయ పద్దతులతో రేబిస్‌ చికిత్సలను మానేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పుతుంది. 

            నేడు భారత వీధుల్లో దాదాపు 40 మిలియన్ల వీడేది కుక్కలు ఉన్నట్లు అంచనా. అత్యధిక సంఖ్యలో వీధి వీధిన సంచరిస్తున్న వీధి కుక్కలకు టీకాలు వేయడం కొంత కష్టమే అయినా వాటికి టీకాలు వేస్తూ, వాటి సంతానోత్పత్తిని కట్టడి చేయడం సమాంతరంగా జరగాలి. భారత ప్రభుత్వం దేశవ్యాప్త ఆసుపత్రుల్లో రేబిస్‌ టీకాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఉచితంగా వేయడం కనీస కర్తవ్యంగా ఏర్పాటు చేయాలి. 

         By-డాక్టర్‌ బుర్ర మధుసూదన్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News