Homeనల్లగొండBanyan Tree Collapse | భారీ వర్షానికి నేలకూలిన మహావృక్షం

Banyan Tree Collapse | భారీ వర్షానికి నేలకూలిన మహావృక్షం

  • తరతరాల జ్ఞాపకాలకు మిగిలిన మౌన సాక్ష్యం…

మఠంపల్లి: దశాబ్దాల తరబడి గ్రామస్తులకు నీడనిస్తూ రైతుల సేద తీరే చిరునామాగా నిలుస్తూ పండుగలు, వేడుకలు, పెద్దల ముచ్చట్లకు సాక్ష్యంగా ఉన్న వందేళ్ల మర్రిమాను మహావృక్షం బుధవారం అకాల వర్షం దానికి తోడు బలమైన గాలికి నేలకొరిగింది(Banyan Tree Collapse). దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామ శివారులో కిష్టాపురం వెళ్లే మార్గ మధ్యలో ఉన్న ఈ మర్రిమాను గ్రామస్తుల జీవనంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంది.

పొలాలకు వెళ్లే రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పనులు ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో చెట్టు అరుగు వద్ద కాసేపు సేదతీరడం దశ ఆనవాయితీగా ఉండేదని గ్రామ పెద్దలు గుర్తుచేసుకుంటున్నారు.ఆ అరుగు వద్ద పెద్దల ముచ్చట్లు,పంటల కబుర్లు, గ్రామ సమస్యలపై చర్చలు, పిల్లల ఆటపాటలు నిత్యకృత్యంగా ఉండేవని చెబుతున్నారు. అప్పట్లో పులి జూదం వంటి ఆటలకు సైతం ఈ అరుగు వేదికగా ఉండేదని పెద్దలు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

- Advertisement -

శ్రీరామనవమి వేడుకలకు ప్రత్యేక అనుబంధం

గ్రామంలో జరిగే శ్రీరామనవమి వేడుకలతో ఈ మర్రిమాను చెట్టుకు ప్రత్యేక అనుబంధం ఉంది. కులమతాలకు అతీతంగా జరిగే వేడుకలకు హాజరయ్యే భక్తులు,ఎడ్ల పందాలు తదితర కార్యక్రమాలకు వచ్చే ప్రజలు ఈ మహావృక్షం నీడలో సేదతీరేవారు. దీంతో ఇది కేవలం ఓ చెట్టుగా కాకుండా గ్రామ సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఒక భాగంగా నిలిచింది.

చెట్టు కూలినా.. జ్ఞాపకాలు చెదరలేదు

నిన్నటి నుంచి కురుస్తున్న అకాల వర్షానికి చెట్టు బలహీనమై ఒక్కసారిగా నేలకూలింది. ఎన్నో ఏళ్లుగా గ్రామానికి నీడనిచ్చిన మహావృక్షం కళ్లముందే కూలిపోవడం గ్రామస్తులను కలచివేసింది. అయితే చెట్టు నేలకూలినా దాని నీడలో గడిపిన బాల్యం,అరుగు వద్ద సాగిన పెద్దల ముచ్చట్లు,పండుగల సందడి,రైతుల విశ్రాంతి క్షణాలు మాత్రం గ్రామస్తుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.మర్రిమాను నేలకూలడం ఒక చెట్టు ముగింపు మాత్రమే కాదు,ఒక తరం జీవనానికి, అనుబంధాలకు, జ్ఞాపకాలకు మిగిలిన చిహ్నం అని గ్రామస్తులు భావిస్తున్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News