జవహర్‌నగర్‌లో మున్సిపల్ కార్యాలయానికి కూత కువైట్ దూరంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల కమర్షియల్ భవనం నిర్మాణం
- అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు శూన్యం
- బాధ్యతారహిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
జవహర్‌నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు చిన్నపాటి గృహ నిర్మాణం చేపట్టాలన్నా అనుమతుల పేరుతో అనేక ఆంక్షలు విధిస్తున్న అధికారులు, మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎటు చూసినా. బహుళ అంతస్తుల కమర్షియల్ భవనం నిర్మాణలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన ఈ నిర్మాణలు పూర్తికి చేరువవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం తీరుపై ప్రశ్నలు
ప్రస్తుతం మల్కాజిగిరి జోన్ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మున్సిపల్ నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు కార్యాలయానికి చుట్టూ పక్కల ఇన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేశారు? అనుమతులు లేకుంటే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదనే విషయాలను అధికారులు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులు లేకుండానే నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి?
జవహర్‌నగర్‌లో గృహ నిర్మాణాలకు అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు, బహుళ అంతస్తుల కమర్షియల్ భవనం నిర్మాణం విషయంలో మాత్రం మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకున్నారా? భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, అనుమతులు, సెల్లార్‌కు అనుమతి వంటి వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని కోరుతున్నారు.

ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి
అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయని, అయితే ఈ ఆరోపణలు నిజమో కాదో అధికారులు సమగ్రంగా విచారణ జరిపి తేల్చాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించారా? నోటీసులు జారీ చేశారా? నిర్మాణాన్ని నిలిపివేయడానికి చర్యలు తీసుకున్నారా? అనే అంశాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
అధికారులు స్పందిస్తేనే వాస్తవాలు వెలుగులోకి
మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో.జరుగుతున్న నిర్మాణంపైనే అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటే, మారుమూల కాలనీల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని, అనుమతులు లేని నిర్మాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలకు ఎవరి అనుమతులు ఉన్నాయి, ఎవరి పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగుతోంది, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గృహ నిర్మాణాలకు అధికారిక అనుమతులు కల్పించాలి
జవహర్‌నగర్‌లో గృహ నిర్మాణాలకు అధికారిక అనుమతుల విషయంలో నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టబద్ధంగా ఇల్లు నిర్మించుకునే సామాన్యులకు స్పష్టమైన విధానం, అనుమతుల ప్రక్రియ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అదే సమయంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలపై ఎలాంటి రాజకీయ, అధికార ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
