- భారతీయ విద్యార్ధులపై నజర్..
- అనుమతిలేకుండా పనిచేయడం నేరం..
కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు తిరస్కరణకు గురికావడం, దానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంపై ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా స్పందించింది. విద్యార్థులు చదువుకునే సమయంలో పనిచేయడానికి వర్తించే నిబంధనలపై కీలక స్పష్టతనిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. స్టడీ పర్మిట్ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా పనిచేయడం ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడమేనని ఐఆర్సీసీ స్పష్టం చేసింది.
పార్ట్-టైమ్గానైనా సరే అనుమతి లేని ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నిబంధనలు పాటించని వారిపై భవిష్యత్తులో ఇచ్చే వర్క్ పర్మిట్లను రద్దు చేయడం, వీసాలు నిరాకరించడం లేదా దేశం నుంచి తిరిగి పంపించివేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. కెనడాలోని పోర్టేజ్ కాలేజ్ విద్యార్థుల వర్క్ వీసాలు తిరస్కరణకు గురికావడంతో వారు ఆందోళనలు చేపట్టగా, ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని సదరు కళాశాల యాజమాన్యం సూచించింది. రాబోయే రోజుల్లో విద్యార్థుల ప్రతినిధులతో భేటీ అయి పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపింది. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యపై, వర్క్ పర్మిట్లపై ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
