- ఏకంగా 58 పైసలు లాభపడిన రూపాయి..
- అంతర్జాతీయ కీలక పరిణామాల నేపథ్యంలో బలపడిన రూపాయి..
అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల ప్రభావంతో నేడు ఫారెక్స్ మార్కెట్ లో అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ బలపడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పతనం కావడంతో రూపాయి ఏకంగా 58 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 94.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి..
ఆ తర్వాత మరింత పుంజుకుని 94.60 వద్ద స్థిరపడింది. గత సెషన్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.18 వద్ద ముగిసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, దీనిలో భాగంగా వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఈ సానుకూల పరిణామాలకు ప్రధాన కారణమైంది. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది.
అందరికీ శుభాకాంక్షలు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందంపై ఈ వారంలో స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు జరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోని ఐదో వంతు ముడి చమురు రవాణా జరిగే ఈ కీలకమైన జలమార్గం తిరిగి తెరుచుకోనుండటంతో సరఫరాపై ఆందోళనలు తొలగిపోయాయి.
