- ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులవైపు జనం మొగ్గు
- ముప్పని తెలిసినా పెరుగుతున్న వినియోగం
- పెళ్లి పందిళ్లలో ‘ప్లాస్టిక్ పంజా’
- సౌలభ్యం పేరుతో సమస్యల వలయంలోకి..
- టీ కప్పుల నుంచి పెళ్లి విందు వరకు అదే పరిస్థితి
- పెరుగుతున్న క్యాన్సర్ కేసులపై ఆందోళన
- పాతరోజులు రావాలంటున్న నిపుణులు
ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి నడుమ విందు భోజనాల్లో విస్తృతంగా వాడుతున్న ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పుగా మారుతున్నాయి. లోహ పాత్రలను వదిలి ప్లాస్టిక్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముప్పని తెలిసినా సౌలభ్యం, తక్కువ ఖర్చు పేరుతో ఈ వాడిపారేసే ప్లేట్ల వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ, వాటి వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రమాదాలను చాలామంది పట్టించుకోవడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
టీ కప్పుల నుంచి పెళ్లి విందు వరకు అదే పరిస్థితి
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, టీ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు ఎక్కడ చూసినా టీ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగమే అధికంగా కనిపిస్తోంది. సౌలభ్యత, తక్కువ ఖర్చు కారణంగా ఇవి ప్రజల జీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేడి ఆహారం ప్లాస్టిక్ ప్లేట్లలో వడ్డించినప్పుడు హానికర రసాయనాలు ఆహారంతో కలిసి జీర్ణక్రియ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, అల్సర్ వంటి ఇబ్బందులకు దారి తీసే అవకాశముండగా, దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి కేసులు నమోదు అవుతున్నాయి.

క్యాన్సర్ కేసులపై పెరుగుతున్న ఆందోళన:
ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ పాత్రల వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేడి ఆహారం వల్ల ప్లాస్టిక్‌లోని రసాయనాలు ఆహారంలో కరిగి, దీర్ఘకాలంలో కణాలపై ప్రభావం చూపి క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌలభ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుభకార్యాలు ఆరోగ్యానికి శాపంగా మారకముందే ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి:
డా. కిరణ్ గౌడ్ బుర్ర , బాలాజీ హాస్పిటల్, మెదక్
ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. లోహపు మరియు మట్టి పాత్రల వినియోగం పెంచాలి. అలా పెరిగితే కులవృత్తులకు సైతం ఉపాధి లభిస్తుంది. “ప్లాస్టిక్ ప్లేట్ల నుండి వివిధ రసాయనాలు ఆహారంలోకి కలిసి జీర్ణక్రియ సమస్యలు, హార్మోన్ల సమస్యలు ఇంకా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది”.ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన ముప్పు.
