చిగురుటాకుల సవ్వడిలో… చిరుగాలి పాడే పాటలో,
వసంత లక్ష్మి అడుగులలో… ప్రకృతి పులకించే వేళ!
మది మదిని కలిపే వేడుక… ఇది రంగుల విందుల జాతర!
వచ్చెనమ్మా రంగుల పండుగ… మురిపించే హోళీ పండుగ!
మోదుగ పూల కషాయం… మేనికి ఇచ్చే ఆరోగ్యం,
సిందూరపు ఎర్రని వర్ణం… చెలిమికి అదియే నిదర్శనం!
పసుపు పచ్చని మెరుపులు… పసిడి తలపుల వెలుగులు,
నీలి నింగి చాయలు… నిత్యం కురిసే ప్రేమామృత జల్లులు!
అలుకలు అన్నీ తుడిచేసి… హరివిల్లును మదిలో నింపాలి,
పగలు ప్రతీకారాలు వీడి… పచ్చని మమతలు పంచాలి!
రంగు రంగుల కలయికలో… ఒకటే రాగం పలకాలి,
మనుషులంతా ఒక్కటనే… మధుర భావం వెలగాలి!
కస్తూరి గంధపు తావిలో… కమ్మని స్నేహం పరిమళించగా,
హోలీ పండగ సంబరం తెచ్చే రంగురంగుల అలజడి పంచే,
మధురమైన పండుగగా పరిమళించి, సంబరాన్ని అందించే
ఈ రంగుల హోళీ వేడుక… లోకమంతా ఆనందం నింపగా!
వసంతఋతువు ఆగమనంతో వచ్చే తొలి వేడుక హోళీ..
ప్రతి సంవత్సరం పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే హోళీ..
ప్రపంచంలో రంగులన్నీ కలిసి చేసే కోలాహాలం ఈ హోళీ..
రాధా కృష్ణులతో మొదలయ్యిన రమణీయ రసమయ క్రీడ హోళీ..
హోళిక అనే రాక్షసిని సంహరించిన దినం హోళీ!!
