- మీ శరీర తత్వాన్ని గమనించి తీసుకోండి..
గోరు వెచ్చని పాలను తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల హాయిగా ఉండడంతో పాటు నిద్ర బాగా వస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే మరికొందరు పేగుల ఆరోగ్యం కోసం తమ రోజును గోరు వెచ్చని పాలతో ప్రారంభిస్తూ ఉంటారు. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కనుక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఖాళీ కడుపుతో పాలను తాగడం మంచిదేనా.. అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.
ఖాళీ కడుపున పాలు తాగడం కొందరికి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. అయితే మరికొందరికి ఖాళీ కడుపున పాలు తాగడం వల్ల ఉబ్బరం, ఆమ్లత్వం కలిగిస్తుంది. కనుక పాలను ఖాళీ కడుపున తీసుకోవాలా వద్దా అన్నది సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
పాలల్లో ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు ఇది సహాయపడుతుంది. కానీ జీవక్రియను పాలు పెంచవని వైద్యులు తెలియజేస్తున్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట కాకుండా వ్యాయామం చేసే సమయానికి దగ్గరగా పాలు మంచిది..
అలాగే కొందరు పూర్తి అల్పాహారంగా పాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని మాత్రమే అల్పాహారంగా తీసుకోకూడదు. కేవలం పాలను తాగి మధ్యాహ్నం భోజన సమయం వరకు ఉండడం అంత మంచిది కాదు కనుక పాలల్లో చియా గింజలు, ఓట్స్, అరటిపండు వంటి వాటిని కలిపి తీసుకోవడం మంచిది.
