Friday, February 27, 2026
Homeక్రైమ్ వార్తలుBlack Hat Alert | మీ వెబ్ సైట్స్ మునిగిపోతాయి జాగ్రత్త..

Black Hat Alert | మీ వెబ్ సైట్స్ మునిగిపోతాయి జాగ్రత్త..

  • ఆందోళన కలిగిస్తున్న బ్లాక్ హ్యాట్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఆధారిత అక్రమ వెబ్సైట్ల ప్రచారం..

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లు దాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల పద్ధతుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో బ్లాక్ హ్యాట్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఆధారిత అక్రమ వెబ్సైట్ల ప్రచారంపై కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ బ్లాక్ హ్యాట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది. నెటిజన్లతోపాటు వెబ్సైట్ల నిర్వాహకులు సైతం బ్లాక్ హ్యాట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సాధారణంగా మనం ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. అందుకోసం కీ వర్డ్స్ ను టైప్ చేయగానే సెర్చ్ ఇంజన్ వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. అక్కడ మొదటగా వచ్చే 3- 4 లింకులే సరైనవని భావించి వెంటనే క్లిక్ చేస్తాం. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. పేరొందిన వెబ్సైట్లలోని భద్రతా లోపాలను ఉపయోగించుకొని సెర్చ్ ఇంజన్ ఫలితాలను మోసపూరితంగా మారుస్తున్నారు.

- Advertisement -

ఇలా సెర్చ్ ఇంజన్ల ద్వారా వెబ్సైట్ల ర్యాంకింగ్ ను అక్రమంగా పెంచడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఈ విధానంలో హానికరమైన లేదా మోసపూరిత కంటెంట్ను అనధికారికంగా చొప్పించి వినియోగదారులను అక్రమ బెట్టింగ్, జూదం, అశ్లీల వెబ్సైట్లు, పైరేటెడ్ కంటెంట్ వైపు మళ్లిస్తున్నారు. తద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ముప్పు ప్రధానంగా వెబ్సైట్ నిర్వాహకులకే ఎక్కువగా ఉంటుందని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.

ఆన్లైన్లో ఏదైనా సమాచారం కోసం సెర్చ్ ఇంజన్ల ఫలితాలపై క్లిక్ చేసే ముందు అవి అసలైన వెబ్సైట్లో కాదో పరిశీలించాలి. అనుమానాస్పద లేదా రీడైరెక్ట్ అయిన వెబ్సైట్లలోని యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. వెబ్సైట్లలో ఉపయోగించే సీఎంఎస్ ప్లాట్ఫామ్లు, ప్లగిన్లు, థీమ్లు, సర్వర్ సాఫ్ట్వేర్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి. మాల్వేర్, అనధికార రీడైరెక్ట్లు, అనుమానాస్పద ఎస్ఈఓ కార్యకలాపాలపై వెబ్సైట్లను నిరంతరం పర్యవేక్షించాలి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల వెబ్సైట్ల బ్రాండ్ ఇమేజీ దెబ్బతినడం, డొమైన్ బ్లాక్ అయ్యే ప్రమాదం, వెబ్సైట్కు ట్రాఫిక్ తగ్గిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి. సాధారణంగా జరిగే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మోసాలు ఇలా ఉంటాయి..

అవసరం లేకుండా ఒకే కీవర్డ్ను పదేపదే కంటెంట్లో చొప్పించడం. నకిలీ వెబ్సైట్ల నుంచి వేల లింకులు ఇచ్చి వెబ్సైట్ ర్యాంక్ పెరుగుతుందని నమ్మించడం. ప్రత్యర్థి వెబ్సైట్ పై స్పామ్ లింకులు వేసి దాని ర్యాంక్ పడేలా చేయడం. బ్లాక్ హ్యాట్ మోసం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 హెల్ప్ లైన్కు ఫోన్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News