Wednesday, February 11, 2026
Homeసాహిత్యంSaraswathi Maatha | చదువుల తల్లి పుట్టిన రోజు పూజా విధానం

Saraswathi Maatha | చదువుల తల్లి పుట్టిన రోజు పూజా విధానం

పురాణాల ప్రకారం సరస్వతీ దేవి పుట్టిన రోజును వసంత పంచమి(Vasantha Panchami) పండుగలా ఘనంగా జరుపుకుంటున్నాం. హిందూ పంచాంగం ప్రకారం ఏటా మాఘ మాసంలో శుక్లపక్ష శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని నిర్వహించడం ఆనవాయితీ. సరస్వతీ మాతను కళలు, విజ్ఞానం, సంగీతాల దేవతగా పరిగణిస్తారు. విద్యా మాత ఒక చేతిలో సంగీత వీణ, మరో చేతిలో విజ్ఞాన పుస్తకం, 3వ చేతిలో మాల, నాలుగో చేయి ఆశీర్వాదం ఇచ్చే భంగిమలో చూడముచ్చటగా, అద్వితీయ భావనను కలిగించే దివ్య రూపంగా ఉంటుంది. వసంత పంచమి నాడు పెద్దఎత్తున భక్తులు నదులు, త్రివేణి సంగమ క్షేత్రాల్లో పుణ్య స్నానాలు, సరస్వతీ మాత పూజలు చేసి తరిస్తారు.

వసంత పంచమి పుణ్య గడియలు

- Advertisement -

ఈ ఏడాది వసంత పంచమి తిథి జనవరి 23 శుక్రవారం ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు పుణ్యకాలం. దీంతో పూజలు చేసుకోవడానికి దివ్యంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రకృతి అందం, నూతన శక్తి ప్రసాదించే వేడుకగా వసంత పంచమిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటాం. ఈ పర్వదిన గడియల్లో కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. చదువుల తల్లి(Chaduvula Thalli) సరస్వతీ దేవి ఆలయాలతోపాటు విద్యాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పిల్లలకు అక్షరభ్యాసాలు చేయించడంతోపాటు మనసుకు ఏకాగ్రత, గృహంలో సానుకూల శక్తుల ప్రవాహం, అనంతమైన వైవాహిక జీవితం, కుటుంబ పురోగతి సిద్ధిస్తుందని మన నమ్మకం.

పూజా విధానం.. నియమ నిబంధనలు..

ఇదే రోజు బాసరలో వ్యాస మహర్షి ఇసుకతో చేసిన సరస్వతీ దేవిని ప్రతిష్టించిన రోజుగా కూడా నమ్ముతారు. వసంత పంచమి రోజు ఉషోదయానికి పూర్వమే నిద్ర లేచి తలస్నానం చేసి, శుభ్రమైన తెలుపు లేదా పసుపు వర్ణపు వస్త్రాలు ధరించి, విఘ్నేశ్వరుణ్ని పూజించి, అక్షర అధి దేవత అమ్మవారి మంత్రాలు పఠిస్తూ, సరస్వతీ అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి పసుపు రంగులో ఉండే పువ్వులు, అక్షింతలు, చందనం, ధూపం, దీపం, పసుపు రంగు మిఠాయిలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. బ్రహ్మదేవుడి నోటి నుంచి సరస్వతీ మాత ఆవిర్భవించి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆహ్లాదకరమైన వసంత రుతువు ప్రారంభంతో సానుకూల శక్తులు ప్రవహిస్తూ మేలు చేస్తాయని నమ్మకం. వసంత పంచమి పర్వదినం రోజు సాత్విక ఆహారం తీసుకోవడం, ఉపవాస దీక్షలు పాటించడం ఉత్తమం.

సరస్వతీ మాతకు భక్తిశ్రద్ధలతో పూజలుచేయటం(Method of Worship) ద్వారా మన వృత్తిల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి జ్ఞానం, మధురమైన వాక్‌ను ప్రసాదించాలని కోరుకుందాం. వాక్‌శుద్ధి, విజ్ఞాన వివేకాలు, తెలివి, సృజనాత్మకత అందించే సరస్వతీ మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.

(జనవరి 23న చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినం వసంత పంచమి సందర్భంగా)

  • డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News