అండమాన్ అండ్ నికోబార్ దీవులను(Andaman and Nicobar Islands) మన దేశ నీలి ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Union Minister Jitendra Singh) శనివారం చెప్పారు. ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించే దిశగా ఇండియా వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. దేశ భవిష్యత్ ఆర్థిక విలువ సముద్ర వనరుల వల్ల పెరుగుతుందని పేర్కొన్నారు. ద్వీప భూభాగాలు, తీర ప్రాంతాలను వదిలివేసి ప్రధాన భూభాగంపై మాత్రమే దృష్టి సారించడం ద్వారా దేశం అభివృద్ధి చెందదనే ప్రధాని మోడీ దార్శనికత ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని నీలి ఆర్థిక వ్యవస్థను, జీవనోపాధిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కీలక సముద్ర సాంకేతిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా జితేంద్ర సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అటల్ సెంటర్ ఫర్ ఓషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఐలాండ్స్(ACOSTI)ను సందర్శించారు. పలు పథకాలను సమీక్షించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో డీప్ ఓషన్ మిషన్(Deep Ocean Mission) నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

