సైకిల్ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు అధికారులు
పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల (Police Martyrs’ Memorial Week Celebrations) సందర్భంగా రాచకొండ (Rachakonda) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్(Lb Nagar), యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri), మల్కాజిగిరి(Malkajgiri), మహేశ్వరం (Maheshwaram) జోన్ల డీసీపీల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ(Cycle Rally)లు నిర్వహించారు. ఈ వారం రోజుల్లో రాచకొండలో బ్లడ్ డైనేషన్ క్యాంప్స్(Blood Donation Camps), ఎస్సే రైటింగ్ కాంపిటీషన్(Essay Writing Competition), షార్ట్ ఫిలిం కాంపిటీషన్(Short Film Competition), ఫొటోగ్రఫీ కాంపిటీషన్స్(Photography Competitions) నిర్వహించారు.

ఈ ర్యాలీల్లో పోలీసులతోపాటు ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారికి డయల్-100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ఉపయోగాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకి పది రోజులపాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

రోడ్డు భద్రత గురించి ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని, లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడపవద్దని సూచించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడపకూడదని హెచ్చరించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ప్రథమ చికిత్స అందించడం గురించి, అలాగే గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరైనా మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు ఉత్సావంతంగా పాల్గొని పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు.
