Wednesday, October 29, 2025
ePaper
Homeఅంతర్జాతీయంJaishankar | చమురుపై ద్వంద్వ నీతి

Jaishankar | చమురుపై ద్వంద్వ నీతి

  • రష్యా చమురు విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి
  • ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కోవిధానం..
  • కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్..

రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కో దేశం పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడాన్ని తప్పుబట్టారు. ‘సెలక్టివ్’గా నిబంధనలు వర్తింపజేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నీతులు చెప్పేవారు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఆసియాన్ సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే. చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్పై ఒత్తిడి తెస్తోంది.


అదే సమయంలో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, యూరప్ మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆసియాన్ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియోతో భేటీ అనంతరం జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు సరఫరా గొలుసులు క్షీణిస్తున్నాయని, మరోవైపు ఇంధన మార్కెట్లు కుచించుకుపోతున్నాయని జైశంకర్ అన్నారు. మరోవైపు టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ వంటి కఠిన సమయాన్ని ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు.


మార్కెట్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా ఇంధన వాణిజ్యం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో కొందరికి మాత్రమే నిబంధనలు వర్తింపజేయడం, ఇతరులకు నీతులు చెప్పేవారు వాటిని పాటించడం లేదంటూ పరోక్షంగా ట్రంప్ సర్కారుకు జైశంకర్ చురకలటించారు. అంతకుముందు మార్క్ రూబియోతో సమావేశమైన ఆయన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News