- దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు
- డిజిటల్ అరెస్ట్‌లపై అవగాహన కలిగించాలి
- అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి
- ఐపిఎస్ ప్రొబెషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- డిజిటల్ అరెస్ట్’ మోసాలపై సుప్రీం సుమోటో విచారణ
- అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు
- ప్రణాళిక రూపొందించాలని సిబిఐకి సుప్రీం ఆదేశం
ప్రజలను చైతన్యం చేయడంతోనే డిజిటల్ అరెస్ట్ ముప్పును ఛేదించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు పోలీస్ శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్ ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ.. భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు.

డిజిటల్ అరెస్టును ప్రజలకు ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పించాలన్నారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి.. తాము పోలీసులమని బెదిరిస్తారని.. తాము చెప్పినట్లు చేయకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడతారని ద్రౌపదీ ముర్ము అన్నారు.
ఇటువంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ డిజిటల్ అరెస్టు ప్రభావం పోలీసు వ్యవస్థపైనా అధికంగా ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేయడంతో.. అసలైన పోలీసులు ఎవరనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతారన్నారు. దీనిని నివారించాలంటే సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులు నూతన సాంకేతికతపైనా పట్టు సాధించాలని సూచించారు.
ప్రణాళిక రూపొందించాలని సిబిఐకి ఆదేశం
డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తుల జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీం పేర్కొంది. వరుసగా జరుగుతోన్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా తీసుకొని విచారణ జరుపుతోంది ఈ నేరాలపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తానని పేర్కొంది. డిజిటల్ అరెస్టు కారణంగా తాను రూ.కోటి కోల్పోయానని హరియాణాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మయన్మార్, థాయ్‌లాండ్ వంటి ఆఫ్ షోర్ లొకేషన్ల నుంచి ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఈ కేసుల దర్యాప్తునకు ఒక ప్రణాళికను రూపొందించాలని సీబీఐను ఆదేశించింది. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో పురోగతిని పరిశీలిస్తామని, దానిని బట్టి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొంది. అలాగే డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.
