ప్రపంచంలోనే అత్యంత పెద్దవయస్కుడైన ప్రెసిడెంట్‌గా కొనసాగుతుండటం విశేషం
సెంట్రల్ ఆఫ్రికా దేశం (central African nation) కామెరూన్‌కి అధ్యక్షుడిగా పాల్ బియా (92) తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈయన ప్రపంచంలోనే అత్యంత పెద్దవయస్కుడైన అధ్యక్షుడి(World’s Oldest President)గా కొనసాగుతున్నారు. పాల్ బియా (Paul Biya) 1982 నుంచి కామెరూన్‌ని పాలిస్తున్నారు. ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఈయనే గెలిచినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ప్రకటించింది.
బియాకు 53.66% ఓట్లు రాగా మాజీ మిత్రురాలు ఇస్సా చిరోమా బకారీకి 35.19% ఓట్లు వచ్చాయని రాజ్యాంగ మండలి (Constitutional Council) తెలిపింది. పోలింగ్ శాతం మాత్రం 57.7% కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ ఫలితాలు కావాలని ప్రతిపక్ష మద్దతుదారులు కొద్దిరోజులుగా కోరుతున్నారు. ఈ మేరకు నిరసనకారులు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు ఇచ్చింది. 5 వేల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకులు ఎలక్షన్స్‌ని పర్యవేక్షించారని కామెరూన్ (Cameroon) ప్రభుత్వం తెలిపింది.
