జంక్ ఫుడ్ లేదా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPFs) అనేవి పరిశ్రమల ద్వారా విస్తృతంగా తయారయ్యే, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు, రంగులు, రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు. వీటిలో స్నాక్స్, బర్గర్లు, నూడుల్స్, చిప్స్, కోల్డ్ డ్రింక్స్ వంటి పదార్థాలు ప్రధానంగా ఉంటాయి. జంక్ ఫుడ్‌లో ఉపయోగించే MSG, ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్లేవర్ బూస్టులు, ఆడిటివ్ పదార్థాలు, సువాసనలు మెదడులో ఆనంద హార్మోన్లను ఎక్కువగా విడుదల చేయడం వల్ల ఒక మానసిక అలవాటుగా మారి వీటిని పదేపదే తినాలనిపిస్తుంది. ఇవి తక్షణ సంతృప్తి కలిగిస్తాయి కానీ దీర్ఘకాలికంగా శరీరానికి హానికరంగా మారుతాయి. ఈ ఆహారాల్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల జీవక్రియలు అసమతుల్యంగా మారి, అధిక బరువు, మధుమేహం, హృద్రోగాలు వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని WHO మరియు FAO నివేదికలు హెచ్చరిస్తున్నాయి. NOVA వర్గీకరణ ప్రకారం వీటిని నాలుగో స్థాయి ప్రాసెస్డ్ ఆహారాలుగా గుర్తించారు. అంటే.. ప్రకృతి స్ఫూర్తి పూర్తిగా కోల్పోయిన ఆహారాలు.
జంక్ ఫుడ్ అధిక వినియోగం ఆరోగ్య క్షీణతకు కారణమని అనేక శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఒక మెటా విశ్లేషణ ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం 40% వరకు టైప్-2 మధుమేహం, 32% వరకు హైపర్‌టెన్షన్‌ను పెంచుతాయని తేలింది. మరో అధ్యయనం ప్రకారం రోజువారీ ఆహారంలో 10% పెరిగిన UPF వినియోగం, మొత్తం మరణాల రిస్క్ 10 % వరకు పెంచవచ్చని సూచించింది. వరుసగా 15 రోజులు ఇలాంటి ఆహారాలను మాత్రమే తీసుకున్నవారు సగటున 1 కిలో బరువు పెరిగారు. రక్తంలోని ట్రైగ్లిసరైడ్ల స్థాయిలు కూడా 10% పెరిగినట్లు గుర్తించారు. ఇలాంటి ఆహారాల వల్ల గట్ మైక్రోబయోటా లోపించి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతున్నట్లు అమెరికన్ న్యూట్రిషన్ జర్నల్ అధ్యయనంలో తేలింది. ఈ ఫలితాలు “కేవలం తినడం” వల్ల మాత్రమే కాదు.. ఆహార ప్రాసెసింగ్ స్వభావమే శరీరంపై ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి.
జంక్ ఫుడ్ వినియోగాన్ని పెంచేవి ప్రధానంగా ప్రచారాలు. మార్కెటింగ్ పరిశ్రమ పిల్లలను, యువతను, తక్కువ అవగాహన ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఆకర్షణీయ దృశ్యాలు, రంగులు, ప్రఖ్యాత నటులు, క్రీడాకారులతో “తక్షణశక్తి, ఆత్మవిశ్వాసం, దమ్ము, హీరో, సంతోషం” అనే మనసుకు హత్తుకునే ఆకర్షణీయ పద ప్రయోగాలతో మానసిక యుక్తులు ఉపయోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల టెలివిజన్ ప్రకటనల్లో 70 % కంటే ఎక్కువ శాతం జంక్ ఫుడ్‌లవే ఉంటున్నాయి. భారతదేశంలో కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆహారాన్ని కేవలం భోజనంగా కాకుండా ‘స్మార్ట్ లైఫ్‌స్టైల్’గా చూపించడం వల్ల మానసికంగా “హెల్త్ రిస్క్” అవగాహన తగ్గిపోతోంది. ఉదాహరణకు, పాపులర్ ఎనర్జీ డ్రింక్స్ ప్రకటనలు యువతను మోసపుచ్చే ప్రధాన వ్యూహంగా మారింది.
జంక్ ఫుడ్ వినియోగం తక్కువ ఆదాయం గల కుటుంబాలు, విద్యా అవగాహన తక్కువ గల వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి సమయం, వనరులు, సమాచారం కొరత కారణంగా వేగవంతమైన ఫుడ్ ఎంపికలు సులభమైన మార్గాలుగా మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు స్కూల్స్, కాలేజీలు, పని స్థలాల సమీపంలో ఎక్కువగా ఉన్నందున పిల్లలు, యువత వాటిపై ఆధారపడుతున్నారు. పాఠశాల పరిసరాల్లో జంక్ ఫుడ్ స్టోర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బాల్య స్థూలకాయం 1.8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాకుండా సామాజిక, ఆర్థిక ప్రభావమని స్పష్టమవుతోంది.
జంక్ ఫుడ్ అనేది తాత్కాలిక సంతృప్తిని ఇవ్వగలిగినా దీర్ఘకాలంలో శరీరాన్ని, మనసును, సమాజాన్ని ప్రభావితం చేసే “నిశ్శబ్ద ముప్పు”. వ్యక్తిగత స్థాయిలో మనం లేబుల్ చదవడం, తక్కువ ప్రాసెస్డ్ ఆహారాలను ఎంచుకోవడం, చక్కెర పానీయాలను తగ్గించడం, పిల్లలకు ఆరోగ్య అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు శాస్త్రీయ ఆధారాలతో పాలసీలను రూపొందించి జంక్ ఫుడ్ ప్రకటనల నియంత్రణ, పన్నులు, పాఠశాలల్లో ఆరోగ్యకర ఆహార అలవాట్ల ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టాలి. WHO “హెల్తీ డైట్ ఫర్ ఆల్ ” కార్యక్రమం ఈ దిశలో మార్గదర్శకంగా నిలుస్తోంది. జంక్ ఫుడ్ రుచికర ఆహార సౌకర్యం కాదు. ఒక సవాలు. శాస్త్రీయ అవగాహనతో, సమాజ చైతన్యంతో మాత్రమే మన ఆరోగ్య భవిష్యత్తును రక్షించుకోగలం.
- వెంకటరమణ గిలకత్తుల
